బెదిరిస్తే భయపడం

ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది

శ్రీకాకుళం అర్బన్‌ : దున్నపోతుకు వినతిపత్రం అందజేస్తున్న అంగన్వాడీలు

  • సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె
  • స్పష్టం చేసిన అంగన్వాడీలు
  • నేడు కలెక్టరేట్‌ వద్ద బైఠాయింపు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి, విధులకు హాజరు కాకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం బెదిరిస్తే భయపడేది లేదని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కళ్యాణి, డి.సుధ అన్నారు. అంగన్వాడీలపై బెదిరింపులను మానుకొని సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌ వద్ద బైఠాయించనున్నట్లు తెలిపారు. పెద్దసంఖ్యలో అంగన్వాడీలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి 22వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా శ్రీకాకుళం అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద 22 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడానికి నిరసనగా దున్నపోతుకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, టి.రాజేశ్వరి, కె.ప్రమీలాదేవి తదితరులు పాల్గొన్నారు. పొందూరులో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ఒంటి కాలిపై నిల్చొని నిరసన తెలిపారు. సమ్మెకు యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు పొందూరు అప్పారావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు బి.జ్యోతిలక్ష్మి, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాళిలో సమ్మె శిబిరానికి ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ చేరుకుని సమ్మె విరమించాలని కోరారు. ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఐదో తేదీ లోగా విధులకు హాజరు కాకుంటే చర్యలు తప్పవన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ స్పష్టం చేయడంతో ఆమె వెనుదిరిగారు. ఇచ్ఛాపురంలో సమ్మె శిబిరం వద్దకు వచ్చిన ఐసిడిఎస్‌ పిఒ నాగరాణి సమ్మె విరమించాలని కోరగా, సమస్యలు పరిష్కరించే వరకు విరమించేది లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌.లకీëనారాయణ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు హైమ, విజయలక్ష్మి తదితరులు స్పష్టం చేశారు. కొత్తూరులో సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని సచివాలయాల్లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ధనలక్ష్మి, జలజాక్షి తదితరులు పాల్గొన్నారు. మెళియాపుట్టిలో సమస్యలు పరిష్కరించాలని సచివాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి.శాంతామణి, సుధారాణి, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలసలో అంగన్వాడీలను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పంచాది లతాదేవి, పి.భూలక్ష్మి, మొదలవలస లత తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్లలో సమ్మె శిబిరాన్ని సిఐటియు ఆవిర్భావ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసు సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు వై.విజయలక్ష్మి, బి.కనకం తదితరులు పాల్గొన్నారు. టెక్కలిలో సమ్మెకు పెన్షనర్ల సంఘం నాయకులు బొడ్డేపల్లి మోహనరావు, పలు సంఘాల నాయకులు ఎన్‌.షణ్ముఖరావు, కొల్లి ఎల్లయ్య, పి.సాంబమూర్తి, కుప్పిలి కామేశ్వరరావు సంఘీభావం తెలిపారు. పలాసలో కాశీబుగ్గ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు నుంచి అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ఐసిడిఎస్‌ అధికారులు తీసుకెళ్తున్న వ్యాన్‌ను అంగన్వాడీలు అడ్డుకున్నారు. తాము లేకుండా అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం ఎలా పంపిణీ చేస్తారంటూ అధికారులను నిలదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వ్యాన్‌ను విడిచిపెట్టేందుకు ప్రయత్నించగా వారికి, అంగన్వాడీలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి జోక్యం చేసుకోవడంతో వ్యాన్‌ను విడిచిపెట్టారు.

 

➡️