మంత్రి అప్పలరాజుపై బెంతు ఒరియాల ఆగ్రహం

బెంతు ఒరియాలకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయకూడదంటూ ఇటీవల పలాసలో గిరిజనులు చేపట్టిన

మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపుతున్న బెంతు ఒరియాలు

ప్రజాశక్తి- కవిటి

బెంతు ఒరియాలకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయకూడదంటూ ఇటీవల పలాసలో గిరిజనులు చేపట్టిన నిరసన ర్యాలీకి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదరి అప్పలరాజు సంఘీభావం ప్రకటించడంపై బెంతు ఒరియాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 32 రోజులుగా తమకు కుల ధ్రువీకరణపత్రాలు మంజూరు చేయాలని దీక్ష చేస్తున్న వీరు మంత్రి తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆదివారం దీక్ష శిబిరం వద్ద బెంతు ఒరియాల ప్రతినిధి రజనీ కుమార్‌ దొలై విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న మంత్రి అప్పలరాజు తీరు సరికాదన్నారు. కేవలం స్వలాభం కోసం తన నియోజకవర్గంలో ఒక వర్గానికి కొమ్ముకాస్తు వారికి సంఘీభావం ప్రకటించడం అప్రజాస్వామ్యకమన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన 100వ రోజు పలాసలో జరిగిన సభలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి బెంతు ఒరియాల స్థితిగతులపై కమిషన్‌ వేసిన విషయం గుర్తుచేశారు. మంత్రి అప్పలరాజు తన వ్యవహార శైలితో అటు సిఎం ఆశయాలకు తూట్లు పొడవడమే కాకుండా బెంతు ఒరియాలకు ప్రథమ శత్రువుగా మారారన్నారు. తమ సహచర గిరిజన సోదరులు పోరాడాల్సింది బెంతు ఒరియాలతో కాదని, నకిలీ బెంతు ఒరియా ధ్రువీకరణ పత్రాలతో లబ్ధి పొందిన వారిపై పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకుల ఉచ్చులో పడకుండా తమ సమస్యను అర్థం చేసుకుని సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. అనంతరం బెంతు ఒరియాలు మోకాళ్ళపై నిలబడి మంత్రి అప్పలరాజు డౌన్‌ డౌన్‌, అప్పలరాజు ఇంటిని ముట్టడిస్తాం, అప్పలరాజును మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో దేవరాజు సాహు, సుభాష్‌ సాహు, హరికృష్ణ బిసాయి, శాంతి సాహు, ప్రభాకర్‌ సాహు, సంతోష్‌ దొలై, భగవాన్‌ బిసాయి, గొంగా సాహు పాల్గొన్నారు.

 

➡️