మహిళా స్వేచ్ఛకు పోరాటాలు అనివార్యం

సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వేచ్ఛ కోసం మహిళలు పోరాటం

మాట్లాడుతున్న ప్రభావతి

ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వేచ్ఛ కోసం మహిళలు పోరాటం చేయడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తిని కొనసాగించడమని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి పిలుపునిచ్చారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో మహిళలు సమస్యలు కర్తవ్యాలు అనే అంశంపై సిఐటియు, యుటిఎఫ్‌, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్తంగా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడుతూ సమాజంలో వర్గపోరాటాల నేపథ్యంలో మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం వల్లే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల కోర్కెల దినంగా చరిత్రపుటల్లో నిలిచిందన్నారు. శ్రామిక మహిళలపై శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ నానాటికి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో మహిళలు తమ హక్కుల కోసం పనిభారం నుంచి విముక్తి కోసం స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ఆర్థిక సామాజిక పోరాటాల బాటపట్టాలని పిలుపునిచ్చారు. మద్యం, మత్తు పదార్థాలు, గృహహింస మహిళల అభివృద్ధికి అడ్డుకుంటున్నాయని అన్నారు. సమాజంలో సగభాగాన ఉన్న మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నా ఇంకా పురుషుడు చాటు స్త్రీగా కొనసాగాలని మనువాద భావజాలం కోరుతుందని అన్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేయాలని ఆలోచనలతో కార్పొరేట్‌ మీడియా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా మహిళలపై లైంగిక దాడులు ఏ మాత్రం నిర్మూలించలేదు సరి కదా నానాటికీ తీవ్రతరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు బి.ధనలక్ష్మి అధ్యక్షత వహించగా, శ్రీకాకుళం దిశా పోలీస్‌ స్టేషన్‌ ఎఎస్‌ఐ కె.రేణుకరాణి, ఐసిసి జిల్లా చైర్మన్‌ ఎం.వాగ్ధేవి, శ్రామిక మహిళా జిల్లా కో-కన్వీనర్‌ ఎ.మహాలక్ష్మి, ఐద్వా జిల్లా కన్వీనర్‌ ఎ.లక్ష్మి, డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్‌ స్వర్ణలత, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చందు, హరీష్‌, పి.పవిత్ర, ఐద్వా నాయకులు పి.శ్రీదేవి, ఎం.లలిత, ఫిజిక్స్‌ లెక్చరర్‌ డాక్టర్‌ స్వర్ణలత, ప్రజా సంఘాల నాయకులు జి.గిరిధర్‌, వి.జి.కె.మూర్తి, పొందూరు అప్పారావు పాల్గొన్నారు.

 

➡️