వడ్డీ రీయింబర్స్‌మెంట్‌కు రూ.2.57 కోట్లు విడుదల

ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు నిర్మిస్తున్న వారికి

నమూనా చెక్కును అందజేస్తున్న నవీన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు నిర్మిస్తున్న వారికి పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని చెల్లించే వఢ్డ రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద జిల్లాలో 23,948 మందికి రూ.2.57 కోట్లు విడుదల చేశారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ నమూనా చెక్కును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 62,463 మంది లబ్ధిదారులైన పలు స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు తమ ఇంటి నిర్మాణం కోసం రూ.35 వేలు వంతున రుణాన్ని తీసుకున్నారని, వారిలో తొలి దశలో 23,948 మందికి వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి రెండో దశలో అందజేయనున్నట్లు చెప్పారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు వంతున ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు వంతున బ్యాంకు రుణం అందించడం ద్వారా మరికొంత లబ్ధి చేకూరుతుందని చెప్పారు. వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. కార్యక్రమంలో గృహనిర్మాణ సంస్థ పీడీ గణపతిరావు, ఇఇ పి.రఘురాం, డిఇఇలు కె.అప్పారావు, జి.రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

➡️