వైసిపి ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌

వైసిపి అభ్యర్థుల మూడో జాబితాపై

తిలక్‌, విజయ

  • ఇచ్ఛాపురం, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పిరియా విజయ, దువ్వాడ శ్రీనివాస్‌ నియామకం
  • వైసిపి మూడో జాబితా విడుదల

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

వైసిపి అభ్యర్థుల మూడో జాబితాపై మూడు, నాలుగు రోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. శ్రీకాకుళం ఎంపీతో పాటు ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాలకు ఎమ్మెల్యే కొత్త అభ్యర్థులను వైసిపి అధిష్టానం గురువారం మూడో జాబితాను విడుదల చేసింది. ఎవరి అంచనాలకు అందని విధంగా మూడో జాబితా ఉండడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. వైసిపి శ్రేణులను సైతం ఆశ్యర్యానికి గురిచేస్తున్నాయి. గతంలో ఎంపీ అభ్యర్థి కోసం పలువురి పేర్లు వినిపించినా, జాబితాలో వారెవరూ లేకపోవడం గమనార్హం. ఎంపీ అభ్యర్థిగా కనీసం ప్రచారంలోనూ లేని కొత్త అభ్యర్థిని అధిష్టానం తెరపైకి తెచ్చింది. కళింగ కార్పొరేషన్‌గా ఉన్న పేరాడ తిలక్‌ ఎంపీ అభ్యర్థిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం అందరినీ విస్తుగొల్పుతోంది. ఎంపీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌, తమ్మినేని సీతారాం పేర్లు ప్రచారంలో ఉన్నా ఆకస్మాత్తుగా పేరాడ తిలక్‌ను ప్రకటించడంతో ఆశ్చర్యపోతున్నారు. టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడుపై అదే సామాజిక తరగతికి చెందిన ధర్మాన సోదరుల్లో ఎవరినో ఒకరిని పోటీ చేయిస్తారని అందరూ భావించారు. కానీ, అధిష్టానం మాత్రం పేరాడ తిలక్‌ను నియమించింది. 2019 ఎన్నికల్లో కళింగ సామాజిక తరగతి నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మళ్లీ అదే సామాజిక తరగతి, అదే నియోజకవర్గానికి చెందిన పేరాడ తిలక్‌ ఎంపీ రామ్మోహన్‌ నాయుడుపై ఈసారి పోటీ పడనున్నారు. 2019 ఎన్నికల్లో టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో తిలక్‌ ఓటమి పాలయ్యారు.టెక్కలి నియోజకవర్గంలోనూ అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ తగాదాల నేపథ్యంలో గతేడాది ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పింది. అధిష్టానం మళ్లీ టెక్కలి నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు దువ్వాడ వాణి వైసిపిలో సమన్వయకర్తగా ఉన్నా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఆమెను తప్పించినట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతో శ్రీనివాస్‌ పోటీ పడనున్నారు. 2109 అచ్చెన్నాయుడపై పోటీ చేసి ఓడిన అభ్యర్థి తిలక్‌, వచ్చే ఎన్నికల్లో ఎంపీ రామ్మోహన్‌ నాయుడుపై పోటీ చేయనున్నారు. రామ్మోహన్‌ నాయుడుపై పోటీ చేసి ఓటమిపాలైన శ్రీనివాస్‌ వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నాయుడుతో బరిలో దిగనున్నారు. ఇచ్ఛాపురంలో అందరి అంచనాలను తలకిందుల చేస్తూ పార్టీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుత నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌తో పాటు రెడ్డిక సామాజిక తరగతికి చెందిన పిలక రాజ్యలక్ష్మి పేర్లను పార్టీ పరిశీలించింది. రాజ్యలక్ష్మి ఇచ్ఛాపురం మున్సిపాలిటీ తప్ప మిగతా మండలాల్లో ఎక్కడా ప్రభావం చూపలేరని పార్టీకి నియోజకవర్గానికి చెందిన ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు అధిష్టానికి సంతకాలతో ఇటీవల లేఖ పంపించారు. సర్వేల ఆధారంగా జెడ్‌పి చైర్‌పర్సన్‌గా ఉన్న పిరియా విజయను రంగంలోకి దించాలని నిర్ణయించింది. మహిళా అభ్యర్థి అయితే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించిన అధిష్టానం అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.జెడ్‌పి చైర్‌పర్సన్‌గా ఉప్పాడ నారాయణమ్మ జెడ్‌పి చైర్‌పర్సన్‌గా ఇచ్ఛాపురం జెడ్‌పిటిసి ఉప్పాడ నారాయణమ్మకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రస్తుత జెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ రాజీనామా చేసిన పక్షంలో నారాయణమ్మను కొత్త చైర్‌పర్సన్‌గా జెడ్‌పిటిసిలు ఎన్నుకోనున్నారు. రెడ్డిక సామాజిక తరగతికి చెందిన నారాయణమ్మది ఇచ్ఛాపురం మండలం ఈదుపురం. జెడ్‌పి చైర్‌పర్సన్‌గా అనూహ్యంగా ఆమె పేరును అధిష్టానం ప్రకటించింది. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే టిక్కెట్‌ రెడ్డిక సామాజిక తరగతికి ఇవ్వాలన్న డిమాండ్‌ నేపథ్యంలో సామాజిక తరగతుల సమీకరణలో పిరియా విజయకు అధిష్టానం టిక్కెట్‌ కేటాయించింది. దీంతో రెడ్డిక సామాజిక తరగతికి జెడ్‌పి చైర్‌పర్సన్‌ పదవిని కేటాయించింది.

 

➡️