సిఎం పర్యటనకు సర్వం సిద్ధం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో

ట్రయల్‌ రన్‌ చేస్తున్న హెలీకాప్టర్‌

  • 2,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు
  • 160 ఆర్‌టిసి బస్సులు వినియోగం

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, పలాస

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. పలాసలో కిడ్నీ ఆస్పత్రి నుంచి హెలీప్యాడ్‌ వరకు, అక్కడ్నుంచి బహిరంగ సభ నిర్వహించే రైల్వే క్రీడా మైదానం వరకు సిఎం జగన్‌ రోడ్‌ షోగా వెళ్లే బస్సుతో పాటు కాన్వారుతో బుధవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. హెలీప్యాడ్‌ నుంచి రోడ్డుకు ఇరువైపులా భారీస్థాయిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.2,400 మంది పోలీసులతో బందోబస్తుసిఎం పర్యటనకు మొత్తం 2,400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు అదనపు ఎస్‌పిలు, 13 మంది డిఎస్‌పిలు, 23 మంది సిఐలు, 56 మంది ఎస్‌ఐలు, 1498 మంది ఎఎస్‌ఐలు, హెచ్‌సిలు, పిసిలు, 40 మంది ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌తో వంద మందికి పైగా హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. బందోబస్తుకు సంబంధించి ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సిఎం కాన్వారు వెళ్లే సమయంలో సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా, ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టాలని తెలిపారు. విశాఖ రేంజ్‌ డిఐజి ఎస్‌.హరికృష్ణ, ఎస్‌పి రాధిక పలాస, కంచిలి మండలాల్లోని సిఎం పర్యటన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు, రూట్‌మ్యాప్‌ పాయింట్లను పరిశీలించారు.ఐదు ప్రాంతాల్లో మెడికల్‌ క్యాంపులుపలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ పరిధిలో ఐదు ప్రాంతాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. పలాస ఆర్‌టిసి కాంప్లెక్స్‌, పలాస జూనియర్‌ కళాశాల, కోసంగిపురం జంక్షన్‌, సిఎం బహిరంగ సభ ప్రాంగణం, హెలీప్యాడ్‌ వద్ద మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభకు హాజరైన వారికి తాగునీరు, ఇతర సౌకర్యాల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.160 ఆర్‌టిసి బస్సులు వినియోగంసిఎం సభకు జనాన్ని తరలిచేందుకు 160 ఆర్‌టిసి బస్సులను వినియోగిస్తున్నారు. శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోలతో పాటు టెక్కలి, పలాస డిపోల నుంచి బస్సులను ఉపయోగించనున్నారు. వీటితోపాటు పలు ప్రయివేటు పాఠశాలల బస్సులను వినియోగిస్తున్నారు.పలాస-కాశీబుగ్గలో ట్రాఫిక్‌ ఆంక్షలుసిఎం పర్యటన నేపథ్యంలో పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రజలకు, సభకు హాజరైన వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆ ఆంక్షలు విధించినట్లు కాశీబుగ్గ డిఎస్‌పి కె.నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్‌ ఆంక్షలు ఈ విధంగా ఉన్నాయి.రూట్‌ రూట్‌ నంబర్‌ 1 : ఇచ్ఛాపురం నుంచి కోసంగిపురం కూడలి మీదుగా పలాసకు వచ్చే ప్రజలు, ఇతర వాహనాలు ఫ్లై ఓవర్‌ పై నుంచి ముందుకెళ్లి మొగలిపాడు జంక్షన్‌ మీదుగా పలాస ఊరులోకి చేరుకోవాలి.రూట్‌ నెంబర్‌ 2 : బెండిగేటు నుండి మూడు రోడ్ల జంక్షన్‌ మీదుగా కోసంగిపురం జంక్షన్‌ వైపు వచ్చే ప్రజలు, బెండిగేటు నుంచి మూడు రోడ్ల జంక్షన్‌ మీదుగా కోసంగిపురం జంక్షన్‌ వైపు వెళ్లాల్సిన వాహనాలు మూడు రోడ్ల జంక్షన్‌ పై నుంచి కాశీబుగ్గ మీదుగా పలాస వెళ్లి మొగలిపాడు జంక్షన్‌ మీదుగా హైవే మీదుగా కొసంగిపురం జంక్షన్‌ వైపు వెళ్లాలి.సభాస్థలికి ప్రజలను తీసుకొచ్చే బస్సులు పలాస జూనియర్‌ కళాశాల వద్ద పార్కింగ్‌ చేయాలి. హెలీప్యాడ్‌కు వచ్చే వారు వారి వాహనాలను మంత్రి కార్యాలయం వద్ద నిలపాలి. అక్కుపల్లి నుంచి వచ్చే వాహనాలు కాశీబుగ్గ వైపు అనుమతించబడవు. రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు ఉదయం ఎనిమిది గంటలకు ముందే రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలి. ఈ ఆంక్షలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అమల్లో ఉంటాయి.

 

 

➡️