16న గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలి

16న గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న తేజేశ్వరరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 16న చేపట్టే గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి పిలుపునిచ్చారు. నగరంలోని ఇందిరానగర్‌ కాలనీలో గల సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు విస్తృతస్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్‌ ప్రకటిస్తూ లక్షలాది కుటుంబాల ఇంటింటికీ వెళ్లి క్యాంపెయిన్‌ చేయాలన్నారు. దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్‌ బంద్‌ నిర్వహించాలని జాయింట్‌ ప్లాట్‌ఫారం ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌, ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లు, సంయుక్త కిసాన్‌ మోర్చా అఖిల భారత స్థాయిలో నిర్ణయించాయని తెలిపారు. పదేళ్ల బిజెపి పాలనలో రైతాంగ, కార్మిక, ప్రజల సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. నిరుద్యోగం పెరిగి, శ్రామికుల నిజవేతనాలు 20 శాతానికి తగ్గాయన్నారు. కార్పొరేట్‌ సంస్థల లాభాలు గరిష్టస్థాయికి చేరాయని చెప్పారు. 2023లో పాలకులు కార్పొరేట్లకు రూ.2.14 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని, 2019-22 మధ్యకాలంలో ఒక శాతంగా ఉన్న బడా కార్పొరేట్ల వాస్తవ ఆదాయం 30 శాతం వృద్ధి చెందగా, పేదల వాస్తవ ఆదాయం 11 శాతానికి పడిపోయిందన్నారు. ధరల నియంత్రణ, పెట్రోల్‌ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా పెంపు వల్ల కుటుంబ జీవనం కష్టమైందన్నారు. ఎన్‌ఎంపి పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రైవేటీకరిస్తుందన్నారు. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్‌, పెన్షన్‌ నిధులను ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు కట్టబెడుతోందని విమర్శించారు. ఎల్‌ఐసి వాటాలను అమ్మేందుకు తెగబడిందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చిందని, కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికిందన్నారు. సమ్మె హక్కును కాలరాస్తోందని విమర్శించారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ, వెల్ఫేర్‌ బోర్డులను నిర్వీర్యం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 8వ పే కమిషన్‌ నియమించకుండా జాప్యం చేస్తోందని చెప్పారు. ఉపాధి హామీని నిర్వీర్యం చూస్తూ కేటాయింపుల్లో కోతలు పెట్టిందన్నారు. 2014లో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. కేరళ తరహా రుణ విమోచన చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల సమస్యను పరిష్కరించడం లేదని విమర్శించారు. సమావేశంలో శ్రామిక మహిళా జిల్లా కో కన్వీనర్‌ ఎ.మహాలక్ష్మి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య ఎం.ఆదినారాయణమూర్తి, కోశాధికారి ఎ.సత్యనారాయణ, ఆర్‌.ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️