27 నుంచి జాతీయస్థాయి నాటిక పోటీలు

ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఈ నెల 27 నుంచి 30

పోస్టర్‌ను అవిష్కరిస్తున్న శంకరశర్మ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఈ నెల 27 నుంచి 30 వరకు జాతీయస్థాయి నాటక పోటీలు నిర్వహించనున్నట్లు శ్రీసుమిత్ర కళా సమితి అధ్యక్షులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. నగరంలోని ఆవోపా కళ్యాణ మండపంలో మంగళవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటా అంతర్జాతీయ రంగస్థలం కళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీసుమిత్ర కళాసమితి ఆధ్వర్యాన జాతీయస్థాయి నాటక పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్‌ వేదికగా జరగనున్న ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నాటక పరిషత్‌లు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ నెల 27న గురజాడ అప్పారావు రచించిన 125 సంవత్సరాల నాటి కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించనున్నట్టు చెప్పారు. ఈ నాటక ప్రదర్శనకు రూ. 50 ప్రవేశ రుసుం చెల్లించిన వారికి మాత్రమే ప్రవేశం కల్పించనున్నట్టు వివరించారు. నాటక ప్రదర్శన అనంతరం రంగస్థల కళాకారులను అభినంద సత్కారం ఉంటుందని అన్నారు. 28 నుంచి 30 వరకు కౌసల్య సుప్రజా రామా, ఎడారిలో వాన చినుకు, మూల్యం, కబ్జా, ఇంద్రప్రస్తం, పక్కింటి మొగుడు తదితర నాటకాలను ప్రదర్శించనున్నట్టు చెప్పారు. ఈ ప్రదర్శనలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో రాజకీయాలకతీతంగా రాజకీయ ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. కార్యక్రమంలో కళాకారులు, జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సుమిత్ర కళా సమితి ప్రధాన కార్యదర్శి గుత్తు చిన్నారావు, కోశాధికారి నక్క శంకరరావు, ఉపాధ్యక్షులు మండవిల్లి రవి, కిల్లాన ఫాల్గుణరావు, తిమ్మరాజు నీరజ, మెట్ట పోలినాయుడు, కొమనాపల్లి సురేష్‌, బంకుపల్లి శంకరం, ఎం.వరలక్ష్మి, పూజ తదితరులు పాల్గొన్నారు.

 

➡️