ఎన్నికల కోడ్‌ వర్తించదా.?

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇలాకాలో

చింతాడ వద్ద ఓ భవనంపై రెపరెపలాడుతున్న వైసిపి జెండాలు

ప్రజాశక్తి- ఆమదాలవలస

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇలాకాలో ఎన్నికల కోడ్‌ వర్తించదా అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం ఆమదాలవలస పురపాలక సంఘం పరిధిలో చింతాడలో శ్రీకాకుళం-ఆమదలవలస ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఓ ఇంటిపై సుమారు 20 వైసిపి జెండాలు ఎగురుతున్న సంఘటన చూసిన ప్రతిఒక్కరూ ఎన్నికల అధికారుల విధి నిర్వహణపై గుసగుసలాడు కుంటున్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చింతాడ ఓటర్లు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వర్గంలో ఓట్లు కలిగిఉన్నారు. ఈ నియోజకవర్గంలో రాష్ట్రమంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అటువంటి నియోజకవర్గంలో ఓ ఇంటి యజమాని మేడపై ఇష్టాను సారముగా వైసిపి జెండాలు కట్టి తన స్వామి భక్తిని చాటుకున్న సంఘటన ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇదే రహదారిలో ప్రయాణాలు సాగిస్తున్న ఆమదాలవలస రిటర్నింగ్‌ అధికారి ఎం.నవీన్‌, పలు ప్రాంతాలకు వెళ్తున్న జిల్లా కలెక్టర్‌, ఇతర ఎన్నికల అధికారులు, ఫ్ల్లెయింగ్‌ స్క్వాడ్‌ వాహనాలు నిత్యం ఇదే దారిలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా మేడపై ఉన్న వైసిపి జెండాలను చూస్తున్నారే తప్ప ఎటువంటి చర్యలు చేపట్టలేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

➡️