బంగారం దుకాణాలు కళకళ

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని

బంగారం దుకాణంలో కొనుగోలు చేస్తున్న మహిళలు

  • ఉగాది రోజున పసిడి కొనుగోలుకు ఆసక్తి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంతో పాటు నరసన్నపేట, పలాస, ఇతర ప్రాంతాల్లో బంగారం దుకాణాలు కళకళలాడాయి. పసిడి ధరలు పరుగులు పెడుతున్నా ఏమాత్రం వెనుకాడకుండా బంగారం, ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపారు. తెలుగు వారు చేసుకునే తొలి పండుగ ఉగాది. ఉగాది రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే ఏడాది పొడవునా అదే తరహాలో కొనుగోలు చేస్తుంటారని ఒక నమ్మకం. అందువల్లే బంగారు, వెండి ఆభరణాలపై ఆసక్తి చూపుతారు. బంగారం, వెండితో పాటు నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు పసుపు, బెల్లం, చింతపండు, ఉప్పు వంటి నిత్యావసర సరుకులను కొనుగోలు చేస్తారు. మరికొందరు బంగారు, వెండి కొనుగోలు చేసేందుకు దుకాణాలకు వెళ్లడంతో మంగళవారం కిటకిటలాడాయి. ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, అందువల్ల ఆశించిన స్థాయిలో కొనుగోలుకు అవకాశం లేకుండా పోతోందని పలువురు మహిళలు వాపోయారు. నగరంలో ఇటీవల వస్త్ర దుకాణాలకు ధీటుగా బంగారు, వెండి దుకాణాలకు తరలివచ్చారు. దీంతో బంగారు, వెండి వ్యాపార కేంద్రంగా నగరం విస్తరించింది. నచ్చిన మోడల్‌, అనుకున్నంత ధరలో కొనుగోలుకు అవకాశం చిక్కిందని గతంలో బంగారు నగలు కొనుగోలు చేయాలంటే విశాఖ నగరానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు స్థానిక వ్యాపారుల భాగస్వామ్యంతో పెద్ద సంస్థలు తమ దుకాణాలను తెరిచి వ్యాపారాలు చేసుకుంటున్నారు. పండగ పూట దుకాణాల్లో సందడిగా కనిపించాయి.

➡️