ఐటిడిఎ ఏర్పాటు చేస్తా

జిల్లాలో గిరిజనుల కోసం ఐటిడిఎను ఏర్పాటు

ఆమదాలవలసలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు

  • నిర్వాసితులకు న్యాయం చేస్తాం
  • వంశధార ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు
  • ప్రతి పనికీ తమ్మినేని, రెడ్డి శాంతికి ముడుపులు
  • వారి భరతం పడతాను’ప్రజాగళం’ సభలో చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, పాతపట్నం, ఆమదాలవలస

జిల్లాలో గిరిజనుల కోసం ఐటిడిఎను ఏర్పాటు చేస్తామని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు. పాతపట్నంలోని ఆల్‌ ఆంధ్రా రోడ్డు, ఆమదాలవలసలోని కృష్ణాపురం కూడలి వద్ద మంగళవారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రసంగించారు. వంశధార – నాగావళి నదుల అనుసంధానం తన కల అని, అధికారంలోకొచ్చాక వాటిని పూర్తి చేస్తానని చెప్పారు. వంశధార ప్రాజెక్టుతో నష్టపోయిన నిర్వాసితులకు న్యాయం చేస్తానన్నారు. ప్రాజెక్టుల వల్ల ప్రజలకు ఎంత మేలు చేకూరుతుందో, వాటి కోసం భూములు ఇచ్చి నష్టపోయిన రైతులకూ పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని హామీనిచ్చారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో వంశధార ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగునీటిని అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నా కూలీలుగా శ్రీకాకుళం జిల్లా వారే ఉంటున్నారని, అందులో పాతపట్నం వారే అధికంగా ఉన్నారని తెలిపారు. పాతపట్నం ప్రాంతంలో ఐటిఐ, ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తే ఇక్కడ యువతే మంచి సేవలు అందిస్తారని చెప్పారు. పాతపట్నంలో వంద పడకల ఆస్పత్రి, మహిళా డిగ్రీ కళాశాల, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. పాతపట్నం నుంచే పనిచేసే వర్క్‌ ఫ్రం హోం తీసుకొస్తామని చెప్పారు. ఆమదాలవలసలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల, సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం వద్ద వంశధార నదిపై వంతెన నిర్మిస్తామన్నారు. నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ, ఐటి హబ్‌ ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు.తమ్మినేనిని విడిచిపెట్టేది లేదుఈ ఎన్నికల్లో ప్రజలు కొట్టే దెబ్బకు డమాబుస్‌ సీతారాం ఒడిశా పారిపోతారని, అయినా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. స్పీకర్‌ పదవికి తమ్మినేని అనర్హుడని, జగన్‌ చెప్పే పనులకు గంగిరెద్దులా తలూపడం తప్ప చేసిందేమీ లేదన్నారు. సైకో మాటలకు తలూపి స్పీకర్‌ స్థానాన్ని అప్రతిష్టపాలు చేశారని ధ్వజమెత్తారు. తమ్మినేని నియోజకవర్గం మొత్తాన్ని ఊడ్చేశారన్నారు. ఏ పని చేయాలన్నా వారి కుటుంబ సభ్యులకు బంగారు కానుకలు సమర్పించాల్సిందేనని ఆరోపించారు. నాగావళి, వంశధార నదుల్లోని ఇసుక మొత్తం ఊడ్చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక్కడి వారికి ఇసుక దొరకదు. కానీ కావాల్సినంత విశాఖకు తరలిస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల బదిలీలకు రేట్‌ ఫిక్స్‌ చేశారని ఆరోపించారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కాంట్రాక్టు పనులలో డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. కాంపౌండ్‌ వాల్‌ నిర్మించుకోవాలన్నా ఆమెకు కమీషన్‌ ఇవ్వాల్సిందేనన్నారు. వంశధార నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వారి భరతం పడతానన్నారు. వైసిపి నాయకులు బిర్యానీ, క్వార్టర్‌ మందు ఇచ్చినా ప్రజలు అవి తీసుకొని టిడిపికే ఓటు వేస్తారని చెప్పారు. టిడిపి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థులు మామిడి గోవిందరావు, కూన రవికుమార్‌ను గెలిపించాలని కోరారు.అభివృద్ధిని గాలికొదిలేశారు : రామ్మోహన్‌ నాయుడుపాతపట్నం నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే రెడ్డి శాంతి గాలికొదిలేశారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. జిల్లాలను విడదీసిన జగన్‌ శ్రీకాకుళం జిల్లాకు ఐటిడిఎ కేంద్రం లేకుండా చేశారన్నారు. వంశధార నిర్వాసితులకు 2013 చట్టం అమలు చేయకుండా వారికి మోసం చేశారని విమర్శించారు. ఆమదాలవలస-శ్రీకాకుళం తొమ్మిది కిలోమీటర్ల ప్రధాన రహదారిని నిర్మించుకోలేని వైసిపి నాయకులు ప్రజల జీవితాలను బాగుచేస్తారా అని ప్రశ్నించారు. వలసలను నిరోధించడానికి ఆమదాలవలస నియోజకవర్గంలో పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.వైసిపికి ఓటు వేస్తే వినాశనం : రవికుమార్‌రాష్ట్రాభివృద్ధి కోసమైతే టిడిపికి, వినాశనం కోసమైతే వైసిపికి ఓటు వేయాలని ఆమదాలవలస అభ్యర్థి కూన రవికుమార్‌ అన్నారు. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్‌ అంటే జగన్‌కు, లాస్ట్‌ ఛాన్స్‌ అంటే తమ్మినేనికి ఓటు వేసి అరాచక పాలనకు అవకాశం ఇచ్చారన్నారు. మరోసారి అలాంటి తప్పు చేయొద్దన్నారు. ఆమదాలవలస నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని, తమ్మినేని మాత్రం అవినీతి, అక్రమాలతో అభివృద్ధి చెందారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా : ఎంజిఆర్‌పాతపట్నం నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గమని ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు తెలిపారు. ఇక్కడ విద్య, వైద్యం, మౌలిక వసతులు లేవన్నారు. ఉపాధి లేక ప్రజలు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరులో ఏర్పాటు చేయాల్సిన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఇక్కడి ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాలకొండకు తరలించారని చెప్పారు. పాతపట్నంలోని ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా గురవుతున్నాయని ఆరోపించారు. పాతపట్నం నీలమణి దుర్గ గుడి నుంచి ఆల్‌ ఆంధ్ర రోడ్డు వరకు చంద్రబాబు నాయుడు రోడ్‌షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి, పాతపట్నం నాయకులు పైల బాబ్జీ, జనసేన పాతపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గేదెల చైతన్య, సలాన మోహనరావు, పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.జనం అవస్థలుపాతపట్నంలో చంద్రబాబు నాయుడు పర్యటనలో జనం పలు అవస్థలు పడ్డారు. శ్రీకాకుళం, టెక్కలి నుంచి వచ్చే బస్సులను కిలోమీటరు దూరం నుంచే ఆపేశారు. మండుటెండలోనే వృద్ధులు, చిన్నారులు నడుచుకుంటూ ఇబ్బందులు పడ్డారు.

➡️