శారీరక వ్యాయామం అవసరం

ప్రస్తుత జీవనశైలిలో శారీరక వ్యాయామం తప్పనిసరి అని

ర్యాలీని ప్రారంభిస్తున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి

ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి

జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రస్తుత జీవనశైలిలో శారీరక వ్యాయామం తప్పనిసరి అని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి అన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయ ఆవరణ నుంచి నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన వారిలో 25శాతం రక్తపోటుకు గురవుతున్నారని తెలిపారు. వ్యాయామం తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు. ప్రతిఒక్కరూ వారంలో ఐదు రోజులు 30 నుంచి 40 నిమిషాలు చొప్పున వ్యాయామం చేయాలని సూచించారు. ఆరోగ్యకర ఆహారపు అలవాట్లను అలవరుచుకోవాలన్నారు. ఉప్పు, స్వీట్స్‌, నూనెల వాడకం తగ్గించి ముందస్తు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమన్నారు. తరచుగా బిపి చెక్‌ చేయించుకోవాలని, క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు. వీటితోపాటు వైద్యాధికారుల సూచనల మేరకు ప్రతిఒక్కరూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలన్నారు. శారీరక వ్యాయామం, బిపి నియంత్రణలో ఉంచుకునేందుకు కృషి చేస్తామని ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆశావర్కర్స్‌ నుంచి ప్రతిఒక్కరూ సమాజంలో ఉన్న తోటి వారిలో, బిపి స్క్రీనింగ్‌ ప్రాధాన్యతను వివరించి, ఆరోగ్యకర జీవన ప్రమాణాలపై అవగాహన కల్పించాలన్నారు. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల నియంత్రణలో అందరూ భాగస్వాములవుతారని చెప్పారు. కార్యక్రమంలో డిఐఒ ఈశ్వరిదేవి, జిల్లా మాస్‌ మీడియా అధికారి పైడి వెంకటరమణ, సుజాత, శ్రీదేవి, ఎన్‌సిడి పైడి అప్పారావు, డిపిఎంఒ జి.వి వెంకటలక్ష్మి, వాన సురేష్‌, డిపిఒ జి.సన్యాసినాయుడు, మురళి, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️