జీడి రైతుకు భరోసా లభించేనా?

పలాస, వజ్రపు కొత్తూరు, మందస, కవిటి, కంచిలి, సోంపేటతో పాటు

 

జీడిపిక్కలకు గిట్టుబాటు ధర కోసం ఏడాదిపైగా పోరాటం కొనసాగిస్తున్న రైతులకు ‘మద్దతు’ కరువవుతోంది. జీడిపంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ లక్షమంది రైతులు సంతకాలు చేసి గతేడాది డిసెంబర్‌లో జీడి రైతుల సంఘం సభ్యులు ముఖ్యమంత్రికి అందించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి స్వయంగా తమ సమస్య వివరించారు. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ మాత్రం లభించలేదు. కనీసం మేనిఫెస్టోలో అయినా జీడి రైతుకు మద్దతు లభిస్తుందని ఆశిస్తే అక్కడా వీరికి నిరాశే మిగిలింది. మరోవైపు ఇటీవలే పలాస వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జీడి రైతును ఆదుకుంటామనే చెప్పారు. అయినా మద్దతుపై మాట్లాడలేదు. దీంతో కొన్ని వేల కుటుంబాలకు ఆధారమైన పంటపై, దాని కోసం పోరాడుతున్న తమపై రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై రైతులు, రైతు సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు అడగడానికి వస్తున్న నాయకులకు తమ పాట్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజాశక్తి- కవిటిపలాస, వజ్రపు కొత్తూరు, మందస, కవిటి, కంచిలి, సోంపేటతో పాటు జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో జీడి పంట సాగవుతోంది. దీనిపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 80వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం రూ.14వేలు పలికిన 80 కేజీల జీడిపిక్కల బస్తా నేడు రూ.7,500 నుంచి 8,500 మధ్య ఊగిసలాడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎకరాకు సుమారు రూ.30వేలు పెట్టుబడిపెట్టి పంట పండించిన జీడి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉన్నది ఒదులుకోలేక, ఉపాధి కోసం వలసపోలేక ఉక్కిరిబిక్కిరౌతున్నాడు.అరచేతిలో స్వర్గం చూపిస్తున్న ప్రభుత్వాలుమేరా భారత్‌ మహాన్‌, మేకింగ్‌ ఇండియా అంటూ ఊదరగొట్టే కేంద్ర ప్రభుత్వం స్వదేశీ పంటైన జీడిపై సీత కన్నేసింది. స్వదేశంలో పండుతున్న జీడిని ప్రోత్సహిస్తూ విదేశాల నుంచి దిగుమతి అవుతున్న పిక్కలు, పప్పుపై నియంత్రణ విధించాల్సింది పోయి వారికి నామమాత్రపు పన్ను విధిస్తూ స్థానిక రైతుల నోట్లో మట్టి కొడుతోంది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న జీడిపిక్కలు, పప్పుపై నామమాత్రంగా కేవలం రూ.2.5 శాతం పన్ను విధించి, ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పిక్కలు దేశంలోకి దిగుమతి జరిగేలా ప్రోత్సహించి జీడి రైతులను నడిరోడ్డుపై నిలబెట్టింది. మరోవైపు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అంటూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి టిటిడిలో నిత్యం టన్నుల కొద్ది వాడే జీడిపప్పును ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొండి చేయి చూపారు.నిలువునా దోచేస్తున్నారుమరోవైపు ఆరుగాలం కష్టపడి రైతు సేకరించిన పంటను దళారీలు, వ్యాపారులు నిలువునా దోచేస్తున్నారు. తమవద్ద కొన్న జీడిపిక్కల ద్వారా ఉత్పత్తి చేసిన పప్పును వివిధ గ్రేడులు చేసి కేజీ రూ.600 నుంచి రూ.1000 వరకు అమ్మిన వ్యాపారులు తమకు మాత్రం 80 కేజీల బస్తాకు రూ.8వేలు మాత్రమే ఎలా ఇస్తారని వాపోతున్నాడు. అంతేకాకుండా 80 కేజీలకు అదనంగా 2 కేజీలు తీసుకుంటు న్నారని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు ఎప్పటికప్పుడు జీడిపప్పు రేటు తగ్గిందని చెబుతున్నా మార్కెట్‌లో కేజీ రూ.600కి తగ్గడం లేదని, నాసిరకం పప్పురేటును నాణ్యమైన పప్పుకు అన్వయించి వ్యాపారులు తమను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ సంస్థ, వ్యక్తి తాము ఉత్పత్తి చేసే వస్తువుకు తామే ధర నిర్ణయించి మార్కెట్టును శాసిస్తున్న ప్రస్తుత రోజుల్లో ప్రపంచానికి ప్రాణం పోస్తున్న రైతాంగానికి మాత్రం ఎందుకు ఆ అవకాశం ఇవ్వడం లేదని జీడి రైతు మదనపడుతున్నాడు.స్పందించని ప్రభుత్వంఏడాదికిపైగా రైతులు, రైతు సంఘాలు జీడి పంటకు గిట్టుబాటు ధర కోసం పోరాడుతుంటే ఇప్పటి వరకూ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరికి ఇచ్చాపురం వచ్చిన ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరించారు. స్వయంగా మంత్రి ఇలాఖాలోనే రైతుకు ఎండనకా, వాననకా పోరాటం చేసినా గాలి మాటలు చెప్పి ఊరుకున్నారే తప్పా రైతులకు ఊరట కలిగించే ప్రయత్నం ఒక్కటీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించే పరిస్థితి కనిపిస్తోంది.’మద్దతు’ ఇస్తామంటున్న టిడిపిమరోవైపు తాము అధికారంలోకి వస్తే జీడి పిక్కలకు మద్దతు ధర కల్పించి ఆదు కుంటామని ప్రచారంలో భాగంగా పలాస వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అదే విధంగా ప్రచారంలో భాగంగా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్‌ జీడికి మద్దతు ధర కల్పించి జీడి రైతుకి అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనలతో జీడి రైతు కొంత ఉపశమనం చెందుతున్నాడు.

➡️