ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రత

May 19,2024 23:31

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో, చుట్టు పక్కల ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్‌పి తుషార్‌ దూడి చెప్పారు. ఈ అంశంపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నియమావళి ప్రకారం జిల్లాలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ను విడిగా బాటిల్స్‌లో పోయడం నిషేధంమని , ఏ పెట్రోల్‌ బంక్‌లో అయినా నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ఓట్ల లెక్కింపు రోజున ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలుంటాయన్నారు. బాణ సంచాలు నిల్వ ఉంచే కేంద్రాల్లో పోలీసు, ఫైర్‌ అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. సమస్యాత్మక గ్రామాల్లోని ముఖ్య ప్రధాన కూడళ్లలో పోలీసుల పికెట్లతో కూడిన బందోబస్తును ఉంటుందని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 అమలులో ఉంటుందన్నారు. నలుగురికి మించి ఎక్కువ మంది ఒకచోట గుమికూడి ఉండరాదని, బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు.ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయొద్దని, సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లను ఎవ్వరూ ఫార్వార్డ్‌ చేయవద్దని కోరారు. అనుమతులు లేకుండా బాణాసంచా కాల్చుటం. ఇతర పార్టీ అభ్యర్థుల, కార్యకర్తల ఇంటి ముందు కవ్వించే విధంగా బాణాసంచా కాల్చి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా చర్యలు తప్పవన్నారు. బైకులకు సైలెన్సెర్లు తీసి, ఎక్కువ శబ్దం చేస్తూ నడిపించటం, ఎక్కువ శబ్దం వచ్చే వాహనాలకు నడిపే వారిపై కేసులు నమోదు చేసి, బైకులు స్వాధీనం చేసుకొని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుంపులు, గుంపులుగా చేరి ప్రజా జీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎవరైనా అనుమానంగా తిరిగినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

➡️