టిడిపి జనసేన పొత్తు లక్ష్యం నెరవేరాలి : పెమ్మసాని

Mar 4,2024 14:36 #gunter, #Jana Sena, #meetings, #TDP

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) :రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా టిడిపి జనసేన పొత్తు లక్ష్యాలను నెరవేర్చేందుకు నాయకులు కార్యకర్తలు సంసిద్ధం కావాలని టిడిపి గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి టిడిపి తరపున డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ పోటీకి సిద్ధమైన నేపథ్యంలో సోమవారం స్థానిక బోస్‌ రోడ్డులోని జనసేన కార్యాలయంలో సమావేశం అయ్యారు. జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జనసేన, టిడిపి అభ్యర్థుల క్రాస్‌ ఓటింగ్‌పై చర్చించారు. అనంతరం డాక్టర్‌ చంద్రశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ ఓటర్లలో క్రాస్‌ ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు చర్చించామన్నారు. ఎంపీ అభ్యర్థి ఓటు టిడిపికి, ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు జనసేనకు వచ్చేలా ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు సమావేశంలో నిర్ణయించామన్నారు. మనోహర్‌ మాట్లాడుతూ త్వరలోనే టిడిపి, జనసేన ఉమ్మడి ప్రణాళికతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి, నాయకులు కార్యకర్తలతో సమావేశం అవుతామన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొత్తు లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా అధికారం చేజిక్కించుకోవాలన్న వైసిపి కుట్రను టిడిపి, జనసేన సమిష్టిగా తిప్పికొడుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి, జనసేన నాయకులు మనోహర్‌, డాక్టర్‌ చంద్రశేఖర్‌ ను కలిశారు. సమావేశంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️