జగన్‌పై దాడి నీచమైన చర్య

Apr 15,2024 21:27

ప్రజాశక్తి- శృంగవరపుకోట : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పై దాడి నీచమైన చర్య అని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని వైసిపి కార్యాలయం వద్ద ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన సర్వేలలో మళ్లీ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని తేల్చి చెప్పడం, జగన్మోహన్‌ రెడ్డికి ప్రజలలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగమే ఈ దాడి అని ఆయన అన్నారు. జగన్మోహన్‌ రెడ్డికి గట్టి భద్రత కల్పించాలని కోరారు.ఈనెల 19న నామినేషన్‌ శృంగవరపుకోట తహశీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఈ నెల 19న తాను నామినేషన్‌ దాఖలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు తైనాల విజరు కుమార్‌, మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, కొప్పల వేలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడు బాబు, జిసిసి చైర్మన్‌ శోభ స్వాతిరాణి, జెడ్‌పిటిసి ముంగులూరు వెంకటలక్ష్మి, వైసిపి మండల అధ్యక్షులు మోపాడ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.మైనార్టీ సంక్షేమం జగనన్నతోనే సాధ్యం మైనార్టీల సంక్షేమం జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఎరుకమ్మ పేరంటాలు కళ్యాణ మండపంలో నిర్వహించిన నూర్‌ భాషా దూదేకుల ముస్లిం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మైనార్టీలకు ఏడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని నవరత్నాల్లో భాగంగా మైనార్టీ మహిళల పేరిట ఇళ్ల స్థలాలను అందజేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షుడు షేక్‌ రహిమాన్‌, నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సిఎంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి పాచిపెంట: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిని నిరసిస్తూ మండల వైసిపి నాయకులు సోమవారం పాచిపెంటలో నల్ల బ్యాడ్జీలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి బి.ప్రమీల మాట్లాడుతూ సిఎంపై దాడి అమానుషమని, దాడికి పాల్పడిన వారిపై ఎన్నికల కమిషన్‌ కఠినంగా శిక్షించాలని చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆమె అన్నారు. వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎంకు ప్రజల నుంచి అనూహ్యస్పందన చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మండల పార్టీ అధ్యక్షులు గొట్టాపు ముత్యాల నాయుడు మాట్లాడుతూ సిఎంపై హత్య ప్రయత్నం దారుణమని, జనాదరణ చూసి ఓర్వలేక ఎన్‌డిఎ కూటమి నాయకులు ఈ దాడికి పాల్పడ్డారని, ఎన్నికల కమిషన్‌ క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ వైస్‌ ఎంపిపి టి.గౌరీశ్వరరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైసీపీకి వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి పై రాళ్లతో దాడి చేశారని, దాడికి ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి కె.రవీంద్ర, మీసాల చంటి, మజ్జి వెంకట్రావు, నడిపల్లి ధనరాజ్‌, రామకృష్ణ, సేనాపతి బాబురావు, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.సాలూరు : సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై రాయి దాడి వెనుక ప్రతిపక్ష పార్టీల కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయనిమండల వైసిపి అధ్యక్షులు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు పువ్వాడ రామకృష్ణ, దండి శ్రీనివాసరావు, పెద్దింటి మాధవరావు అన్నారు. సోమవారం వారు మామిడిపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేమంతా సిద్దం బస్సు యాత్రకు లభిస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేని టిడిపి, జనసేన నాయకులే ఇలాంటి దాడికి ప్రోత్సహించి ఉంటారన్నారు. ఈ దాడిని ఖండిస్తూ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో వైసిపి నాయకులు కాగాన పోలి నాయుడు, సాదాపు రమణ, సాంబ పాల్గొన్నారు.

➡️