పురిట్లోనే శిశువు, కొద్దిసేపటికి తల్లి మృతి

Jun 18,2024 23:19

ప్రజాశక్తి – విజయపురిసౌత్‌ : ప్రసవ సమయంలో శిశువు మృతి చెందడంతోపాటు కొద్ది సేపటికి తల్లీ మృత్యువాత పడిన ఘటన విజయపురిసౌత్‌లో మంగళవారం చోటుచేసుకుంది. దీనిపై మృతురాలి బంధువుల ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం.. విజయపురిసౌత్‌లోని డౌన్‌ మార్కెట్‌కు చెందిన కారే పావని (21) 9వ నెల గర్భిణి. మొదటిసారి గర్భవతి అయిన పావని ఇప్పటి వరకూ సాధారణ వైద్య పరీక్షలను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే చేయించుకున్నారు. అనారోగ్య సమస్యలేమీ వైద్యులు ముందుగా చెప్పలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి నొప్పులు వస్తుండడంతో పావనిని 7-8 గంటల మధ్య విజయపురిసౌత్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే అప్పుడే ప్రసవం కాదని వైద్యులు చెప్పడం, మరోవైపు పావని పరిస్థితిని, వైద్యసిబ్బంది తీరును గమనించిన ఆమె బంధువులు పావనిని మాచర్లలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే అవసరమేమీ లేదని వైద్యసిబ్బంది చెప్పడంతో మిన్నకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పావనికి సిజేరియన్‌ ద్వారా పురుడు పోయగా జన్మించిన శిశువు మృతి చెందింది. పావనికి రక్తస్రావం బాగా అవుతుండడంతో కొద్దిసేపటికే ఆమెకూడా అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో ఆమెను 108లో మాచర్లకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా కొద్దిసేపటికి మృతి చెందారు. దీంతో మృతు రాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సరైన వైద్యం చేయకపోవడం, కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని, అంబులెన్స్‌ సైతం ఫోన్‌ చేసిన గంటకుగాని రాలేదని మండిపడ్డారు. మాచర్ల రూరల్‌ సిఐ కె.సురేష్‌, విజయపురిసౌత్‌ ఎస్‌ఐ పట్టాభి రామయ్య సంఘటనా స్థలికి చేరుకొని మృతురాలి కుటుంబీకులతో మాట్లాడి ఆందోళన విరమిం పజేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పట్టాభి రామయ్య తెలిపారు.

➡️