గీతకి ఎదురుగాలి

Apr 30,2024 21:29

ప్రజాశక్తి – సాలూరు : అరకు పార్లమెంట్‌ స్థానం పరిధిలో టిడిపి, జనసేన, బిజెపిల కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు ఎదురుగాలి వీస్తోంది. ప్రజాదరణతో కాకుండా కేవలం ధనబలం, అధికారపార్టీ అండదండలతో నెట్టుకురావచ్చుననే అతి విశ్వాసంతో ఆమె బిజెపి ఎంపి అభ్యర్థిగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మన్యం జిల్లాలో బిజెపికి పెద్దదిక్కు గా వున్న మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ కోర్‌ కమిటీ సభ్యులు నిమ్మక జయరాజ్‌ కూడా ఎంపీ సీటు ఆశించారు. నిమ్మక జయరాజ్‌ గత కొంతకాలంగా నకిలీ గిరిజన ధ్రువపత్రాలతో రాజకీయాల్లో చలామణీ అవుతున్న వారిపై పోరాటం చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కుటుంబీకులపై ఆయన పోరాడి విజయం సాధించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజా ఎన్నికలకు సంబంధించి కూడా నకిలీ గిరిజన నాయకులకు అరకు ఎంపీ సీటు ఇవ్వొద్దని ఆయన వాదిస్తున్నారు. మాజీ ఎంపీ గీతను కూడా కుల వివాదం వెంటాడుతూనే ఉంది. ఆమె ఎస్టీ కాదని గిరిజన సంఘాలు పోరాడుతున్నాయి. గతంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ఆమె ఎస్టీ కాదని పేర్కొంటూ నివేదిక ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ జరిపి ఆమె ఎస్టీ కాదని నిర్ధారణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఉత్తర్వుల అమలుపై ఆమె హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని ఎస్టీగా కొనసాగుతున్నారు. ఒకవైపు కులవివాదమే కాకుండా ఫోర్జరీ, బ్యాంక్‌ చీటింగ్‌ లాంటి కేసులు కూడా ఆమెను వెంటాడుతున్నాయి.ఈ కేసులన్నింటి నుంచి తనకు క్లియరెన్స్‌ లభించిందని ఆమె చెబుతున్నారు. ఇంతటి తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న కొత్తపల్లి గీతకు ఎంపీ సీటు ఇవ్వొద్దని మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే జయరాజ్‌ వ్యతిరేకించారు. మన్యం జిల్లా బిజెపి అధ్యక్షుడు ద్వారపు రెడ్డి శ్రీనివాసరావు కూడా గీతకు ఎంపీ టికెట్‌ ఇవ్వొద్దని కోరుతూ బిజెపి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ కి చెందిన నాయకులే ఆమె అభ్యర్ధి త్వాన్ని వ్యతిరేకించినా బిజెపి అధిస్థానం ఆమె కే మద్దతు పలికింది. అరకు ఎంపీ సీటు విషయంలో కొత్తపల్లి గీత కి మద్దతుగా నిలిచిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై కూడా మాజీ ఎమ్మెల్యే జయరాజ్‌ విమర్శలు గుప్పించారు. పురంధరేశ్వరి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎపిలో బిజెపి భ్రష్టుపట్టిందని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే నెపంతో నిమ్మక జయరాజ్‌పై బిజెపి అధిస్థానం సస్పెన్షన్‌ వేటు వేసింది. కొద్ది రోజుల క్రితం సాలూరు పట్టణానికి వచ్చిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత మాజీ ఎమ్మెల్యే జయరాజ్‌ వ్యాఖ్యలపై స్పందించారు. జయరాజ్‌పై బిజెపి అధిస్థానం సస్పెన్షన్‌ వేటు వేసిన తర్వాత ఆయన కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు.ఆమెను ఓడించడమే లక్ష్యంగా చేసుకుని జయరాజ్‌ చివరికి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. బిజెపి మిత్ర పక్షాలైన టిడిపి,జనసేన నాయకుల్లో నూ ఆమె పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో టిడిపి జనసేన బిజెపి ల కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత మూడో స్థానం లో నైనా నిలబడతారా అన్నది ప్రశ్నార్థకంగా వుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో కూడా ఆమెపట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2019 వరకు ఆమె వైసిపి ఎంపీగా పని చేశారు. అప్పుడు కూడా ఆమె వైసిపిని వీడి అధికారంలో ఉన్న టిడిపి, బిజెపి లకు చేరువయ్యారు. ఎంపీగా ఆమె ఐదేళ్లలో నియోజకవర్గ సమస్యలపై పార్లమెంటులో గళమెత్తిన దాఖలాలు లేవు.వైసిపి, సిపిఎం అభ్యర్థుల మధ్యే పోటీఅరకు పార్లమెంటు నియోజకవర్గంలో వైసిపి, సిపిఎం అభ్యర్ధుల మధ్య పోటీ వుండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అరకు సిటింగ్‌ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కోడలు డాక్టర్‌ తనూజా రాణిని వైసిపి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించింది. సిటింగ్‌ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ పై కూడా తీవ్రమైన ఆరోపణలు వున్నాయి. తనూజా రాణికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఇండియా వేదిక మద్దతుతో పోటీలో ఉన్న సిపిఎం అభ్యర్ధి పాచిపెంట అప్పలనర్సకే వుంది. అప్పలనర్స సిపిఎం పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ అభ్యర్థి వరకు ఎదిగారు. అరకు, పాడేరు ప్రాంతంలో అనేక గిరిజన ఉద్యమాల్లో పాల్గొన్నారు. జీవో నెంబర్‌ 3 రద్దు, బోయ వాల్మీకి లను ఎస్టీల్లో చేర్చడం, బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. ఉన్నత విద్యావంతుడు, పోరాట పటిమ కలిగిన యువ నాయకుడు అప్పలనర్సకు కాంగ్రెస్‌, సిపిఐ మద్దతు పలుకుతున్నాయి. అప్పలనర్సకు గిరిజన సమస్యలపై పూర్తి అవగాహన వుంది. వైసిపి ఎంపీ అభ్యర్థి తనూజా రాణి రాజకీయాలకు కొత్త కావడంతో ఆమె తన మామ శెట్టి ఫాల్గుణ సలహాలు సూచనలపై ఆధారపడి పని చేయాల్సి ఉంటుంది.తాజా పరిణామాల నేపథ్యంలో అరుకు ఎంపీ నియోజకవర్గం నకిలీ గిరిజనులు, నిజమైన గిరిజనుల మధ్య పోరాటంగా కనిపిస్తోంది.

➡️