నాడు కోలాహలం.. నేడు నిర్మానుష్యం

Apr 23,2024 21:23

ప్రజాశక్తి – పూసపాటిరేగ : సార్వత్రిక ఎన్నికలు వచ్చాయంటే ఆ గృహంలో కోలాహలం మొదలయ్యేది. పతివాడకు జిందాబాద్‌.. అంటూ నినాదాలు.. కేరింతలు.. కేకలు వినిపించేవి. అన్ని దారులూ ఆ గ్రామం వైపే అన్నట్లు ఉండేది మండలంలోని చల్లవానితోటలోని మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామినాయుడు స్వగృహం. దాదాపు ఐదు దశాబ్దాల తరువాత సార్వత్రిక ఎన్నికల వేళ ఆ గృహం మూగబోయింది. నాటి ఎన్నికల కోలాహలం గుర్తు చేసుకుంటూ ఆ గ్రామస్తులు నివ్వెరపోతున్నారు. పతివాడ నారాయణస్వామినాయుడు.. ఈ పేరు దాదాపుగా అందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఆయన పది సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఏడు సార్లు విజయం సాధించిన ఘనుడు. చంద్రబాబు కేబినెట్‌లో చక్కెర, ఉద్యానవన శాఖా మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఏర్పడ్డ చంద్రబాబు ప్రభుత్వంలో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణాలు చేయించారు. అంతటి ఖ్యాతి ఉన్న పతివాడ రాజకీయ జీవితం ఈ ఎన్నికలతో కనుమరుగవుతోంది. పతివాడ నారాయణస్వామి నాయుడు 1978లో రాజకీయ ప్రవేశం చేసి జనతా పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఎన్‌టిఆర్‌ పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరి అప్పటి భోగాపురం నియోజకవర్గం నుండి 1983లో ఎమ్మెల్యేగా బరిలో దిగి విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 30 సంవత్సరాలు ఏక చక్రాధిపత్యం సాగించారు. భోగాపురం నియోజకవర్గం నుంచి నెల్లిమర్ల నియోజకవర్గంగా పునర్విభజన తరువాత వచ్చిన 2009లో ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో మరలా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత నుంచి ఆయన వయస్సు మీద పడటంతో ప్రతేక్య రాజకీయాలకు దూరమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన్ను మార్చి కర్రోతు బంగార్రాజుకు బాధ్యతలు అప్పగించారు. 50 ఏళ్లు సందడి కనుమరుగుసుమారు 50 ఏళ్లపాటు ఆ గ్రామంలో, ఆ గృహంలో ఎన్నికలు వచ్చాయంటే కోలాహలం మొదలయ్యేది. నెల రోజుల ముందు నుండే వంటలు, వడ్డింపులు, జెండాలు, కరపత్రాలు. ప్రచార వాహనాలు, మందుగుండు సామగ్రి, సమావేశాలు, సభలు ఇలా పండగ వాతావరణమే ఉండేది. అనుదినం వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఆ ఇంటికి వస్తూ వెళుతూ జాతరను తలపించేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. పతివాడ వృద్ధాప్యం కారణంగా 2023లో టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు నుండి తప్పించారు. అయినా పెద్దాయనంటూ టిడిపిలో జరిగే ఏ కార్యక్రమమైనా ఆయన గృహంలోనే జరిగేది. అయితే రాజకీయ సమీకరణాలు నేపథ్యంలో ఈ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుండి టిడిపి సీటును జనసేనకు కేటాయించారు. నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారాలన్నీ జనసేన అభ్యర్థి స్వగృహం భోగాపురం మండలం ముంజేరు నుండే సాగుతున్నాయి. దీంతో పతివాడ గృహం నిర్మానుష్యంగా మారిపోయింది. అటువైపు వెలుతున్న తెలుగు తమ్ముళ్లతో పాటు గ్రామస్తులు నాటి కోలాహలం గుర్తు చేసుకుంటూ ఇంతలోనే ఎంత మార్పు అంటూ చర్చించుకుంటున్నారు.

➡️