నడికుడి – శ్రీకాళహస్తిరైల్వేలైన్‌ పనులు వేగవంతం : ఉగ్ర

ప్రజాశక్తి -కనిగిరి: నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పనులు వేగంగా సాగుతున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కలగట్ల రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్‌, గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్ప్రెస్‌ హైవే రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల్లో పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ కనిగిరి ప్రాంత ప్రజల కల అయిన నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ నిర్మాణ పనులు బిజెపి సీనియర్‌ నాయకులు వెంకయ్య నాయుడు చొరవతో వేగంగా సాగుతున్నాయని తెలిపారు. రైల్వే లైన్‌, ఎక్స్‌ప్రెస్‌ హైవే రోడ్డు నిర్మాణ పనులు మొదటి దశలో ఉన్నందున కనిగిరి ప్రాంతంలో ప్రజల అవసరాల దృష్టి కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించినట్లు తెలిపారు. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్‌, గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అయితే కనిగిరి ప్రాంతం ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, ఫలితంగా అభివద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కనిగిరి పట్టణ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు నంబల వెంకటేశ్వర్లు, కన్వీనర్‌ శ్రీనివాసరెడ్డి, నాయకులు రాచమల్ల శ్రీనివాసరెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, గుడిపాటి ఖాదర్‌, షేక్‌ బారా ఇమామ్‌, ఎల్‌విఆర్‌, బాలు ఓబుల్‌ రెడ్డి, సైకం మాలకొండ రెడ్డి, కొండ కష్ణారెడ్డి, బ్రహ్మం గౌడ్‌, నారపరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

➡️