వేలాది మంది కార్మికులు.. చిన్న గదుల్లో ఆస్పత్రి..

Apr 15,2024 23:29

గణపవరంలో ఇఎస్‌ఐ డిస్పెన్సరీ కొనసాగుతున్న అద్దె భవనం
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
వందలాది పరిశ్రమలు, వేలాదిమంది కార్మికులు ఉన్న చిలకలూరిపేట ప్రాంతంలో ఇఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ దశాబ్ధాలుగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు పూనుకోవడం లేదు. 2012 నుండి చిన్నపాటి డిస్పెన్సరీని చిలకలూరిపేటలోని ఆర్‌టిసి బస్టాండ్‌ ఎదుట ఓ అద్దె భవనంలోని ఒక భాగంలో నడుపుతు న్నారు. దీనికి నెలకు రూ.16 వేలను ప్రస్తుతం అద్దెగా చెల్లిస్తున్నారు. ఇందులో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ వైద్యులు అందుబాటులో ఉంటున్నా మిగతా సమయాల్లో అత్యవసరంగా వైద్యం అవసరం వచ్చినా, ప్రమాదాలకు గురైనా ప్రాథమిక చికిత్సలకూ ఇఎస్‌ఐ కార్డుదారులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఉన్న డిస్పెన్సరీలోనూ ఒక్క బెడ్డే ఏర్పాటు చేశారు. ల్యాబ్‌, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లూ కరువే. ఈ పరిస్థితుల్లో వైద్య సేవల కోసం విజయవాడకు వెళ్లాల్సి రావడంతో అది ఇబ్బంది అయిన కార్మికులు పట్టణంలోని ప్రైవేటు ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు.చిన్నతరహా పరిశ్రమలకు పేరుగాంచిన గణపవరంలో చిన్న పెద్ద పరిశ్రములు 120-150 వరకూ ఉన్నాయి. వీటిల్లో లక్షమంది కార్మికులు పని చేస్తున్నారు. వీరి జీతాల్లో ప్రతినెలా ఇఎస్‌ఐకు కొంత మొత్తాన్ని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ (ఇఎస్‌ఐ) కింద కేంద్ర ప్రభుత్వం మినహాయించకుంటోంది. కార్మికులకు ప్రమాదాలకు గురైనా, అనారోగ్యం బారిన పడినా వీరికి వైద్యసేవలు అందించాల్సిన ఇఎస్‌ఐ ఆస్పత్రి మాత్రం చిలకలూరిపేట ప్రాంతంలో లేదు. జిల్లా స్థాయిలో మాచర్ల, చిలకలూరిపేటలో మాత్రమే డిస్పెన్సరీ లున్నాయి. ఇక్కడ జ్వరం, తలనొప్పి, బీపీ, షుగర్‌ వంటి వాటికి పరీక్షలు, మందులు మినహా పెద్ద సౌకర్యాలేమీ లేవు. ఈ డిస్పెన్సరీకి నెలకు సగటున వెయ్యిమంది, ఏడాదికి 12 వేలకుపైగా కార్మికులు వైద్య చికిత్సల కోసం వస్తుంటారు. వీరితోపాటు ప్రతినెలా ప్రమాదాలు, అత్యవసర వైద్యం కోసమూ వచ్చే కార్మికులుంటారు. అయితే ఒంగోలు-విజయవాడ మార్గంలో మార్టూరు, చిలకలూరిపేటలో మాత్రమే డిస్పెన్సరీలున్నాయి. సరైన వైద్యసదుపా యాలు అందించే ఆస్పత్రుల లోటు తీవ్రంగా ఉంది. పని ప్రదేశాలతోపాటు వాహన రాకపోకలు ఎక్కువగా ఉండే ఈ మార్గంలో కార్మికులకు ప్రమాదాలకు గురైతే విజవాడకు వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా డిస్పెన్సరీలో ఒక్క బెడ్‌ మాత్రమే ఉండడం వల్ల సెలైన్‌ పెట్టాలన్నా ఒకేసారి ఇద్దరికి పెట్టే వీలు లేదు. కనీసం నాలుగు బెడ్లు ఏర్పాటు చేయాలనే కార్మికుల విన్నపాలనూ పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. షుగర్‌, హిమోగ్లోబిన్‌, మూత్ర పరీక్షలు, కిడ్నీ పరీక్షలు చేయడం లేదు. చిన్నపాటి పరీక్షలకైనా విజయవాడకు వెళ్లక తప్పడం లేదు. అంతదూరం వెళ్లలేని వారు సొంత డబ్బులు పెట్టుకుని చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా తమ మొర ఆలకించి ఇఎస్‌ఐ ఆస్పత్రిని కీలకమైన ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు.ఇదిలా ఉండగా మందులివ్వడంలో గతంతో పోలిస్తే పరిస్థితులు కాస్తంత మెరుగుపడ్డాయని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ట్రామాకేర్‌ వసతులతో కూడిన ఇఎస్‌ఐ ఆస్పత్రి అవసరమని అయితే తాత్కాలికంగా అయినా ల్యాబ్‌ను పూర్తిగా మెరుగుపర్చాలని, అన్ని పరీక్షలూ చేయడానికి పరికరాలు, సిబ్బందిని సమకూర్చాలని అంటున్నారు.

➡️