పేదల సంక్షేమమే థ్యేయం : స్వామి

ప్రజాశక్తి- కొండపి : పేదల సంక్షేమమే టిడిపి థ్యేయమని టిడిపి కూటమి కొండపి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మండల కేంద్రమైన పొన్నలూరులో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చట్టాన్ని బలవంతంగా తెస్తున్నారని విమర్శించారు. ఈ చట్టం అమలైతే ప్రజలు తమ ఆస్తులు కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు రెండో సంతకం చేస్తారని తెలిపారు. చంద్రబాబు తీసుకొచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ టిడిపి మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేసినట్లు తెలిపారు. కొండపి నియోజకవర్గ ప్రజల జీవనాడి అయినా సంఘమేశ్వరం ప్రాజెక్టును యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు సాగునీరు, తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా స్వామిని, ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు, మాజీ అధ్యక్షుడు మండవ ప్రసాద్‌, సీనియర్‌ నాయకులు కర్ణ కోటిరెడ్డి, పిల్లి వెంకటనారాయణ రెడ్డి, గుమ్మళ వెంకట్రావు, మండవ మురళి, జనసేన నాయకులు కనపర్తి మనోజ్‌ కుమార్‌, పల్లపోతు ప్రసాద్‌, పల్లపోతు రమేష్‌, పల్లపోతు కోటేశ్వరరావు, టిడిపి జనసేన, బిజెపి, నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. శింగరాయకొండ : టిడిపితోనే రైతులకు అండఅని టిడిపి కొండపి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దామచర్ల సత్య తెలిపారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచాన్ని శనివారం ముగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో ఎమ్మెల్యే స్వామి మాట్లాడారు. గతంలో టిడిపి హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. దామచర్ల సత్య మాట్లాడుతూ యర్రగొంటపాలెం నుంచి వచ్చిన సురేష్‌ మళ్లీ యర్రగొండపాలెం పోతారన్నారు. చిత్తూరు నుంచి వచ్చిన చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మళ్లీ చిత్తూరు పోతారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా స్వామిని, ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️