అంబేద్కర్‌ విగ్రహం కూల్చివేతపై నిరసన

అంబేద్కర్‌ విగ్రహం కూల్చివేతపై నిరసన

అంబేద్కర్‌ విగ్రహం కూల్చివేతపై నిరసనప్రజాశక్తి-తిరుపతి(మంగళం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చివేయడం పట్ల తిరుపతి రూరల్‌ మండలం అవిలాల పంచాయితీ శానప్ప కాలనీవాసులు నిరసన తెలియజేశారు. ఆక్రమణదారులపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా శానప్ప కాలనీవాసులు మాట్లాడుతూ అవిలాల పంచాయతీ సర్వే నెంబర్‌ 146లో 57 సెంట్లు విస్తీర్ణం గల భూమి ఉందన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఈ కాలువ పొరంబోకు భూమిలో గ్రామానికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. ఎంతో విలువైన ఈభూమిపై ఆక్రమణదారుల కన్ను పడిందని, ఈ భూమికి సమీపంలోనే ఆరు ఎకరాల హథీరాంజీ మఠం భూమి ఆక్రమణకు గురైందని చెప్పారు. సమీపంలోనే ఉన్న శానప్పకాలని భూమిపైన ఆక్రమణదారులు దష్టి పెట్టారని, దీంతో మూడు నెలలుగా ఈ వివాదం నడుస్తూ ఉన్నట్టు చెప్పారు. ఈ భూమిని ఎలాగైనా రక్షించుకోవాలన్న తలంపుతో ఈనెల 14వ తేదీ శానప్ప కాలనీ వాసులు ఉమ్మడిగా అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి ఆక్రమణదారులు తొలగించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని కాపాడాలని కాలనీ వాసుల కోరారు. తమకు న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆక్రమణదారులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️