ఇంతకీ ఎవురు గెలుస్తారబ్బా..!

Mar 27,2024 21:57
ఇంతకీ ఎవురు గెలుస్తారబ్బా..!

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి ఎలచ్చన్లు…ఎలచ్చన్లు.. అంటా ఉండినాము ఒచ్చేసినాయి …క్యాండేట్లు ఎవురు ఎవురు అనుకుంటా ఉండినాము… క్యాండేట్లు ఒచ్చేసినారు… ఇప్పుడు ఎవురు గెలుస్తారు… ఎవురు గెలుస్తారు అనుకుంటా ఉండారు. క్యాండేట్ల కన్నా జనాలకి ఆ ఇది ఎక్కువైపోయింది. రూలింగ్‌ పార్టీ ఓళ్ళు నవరత్నాలు… నవరత్నాలు అని బటన్‌ నొక్కతా ఉండారు… సరే బటన్‌ నొక్కినాక దుగ్గాళ్ళు పడక పోయినా ఎప్పుడో ఒకప్పుడు ఒచ్చినాయిలే… మేము అన్ని ఆమీలు చేసేసినామ్‌ అని చెప్తా ఉండారు… రోడ్లు.. గీడ్లు.. బిల్డింగులు… కాలవలు.. సెరువులు.. ఏమీ కట్టకపోయా… అదేమంటే మాది సంచేమ పెభుత్వం అని చెప్తా ఉండిరి. పెతిపచ్చం ఓళ్లు సూపర్‌ సిక్స్‌ అంటా ఉండారు. నవరత్నాలు కన్నా బాగుంటాయని సూపర్‌ సిక్స్‌ అని పెట్టినారాంట.. సిక్స్‌ తిరగేస్తే 9 …9 తిరగేస్తే సిక్స్‌.. జనాల్ని నమ్మించేదానికి ఈ ఇదంగా జేస్తా ఉండారు. రాష్ట్రానికి ఓదా తెస్తాము… పోలారం పూర్తి జేస్తాము… కాలువలు తెప్పిస్తాము…తాగేదానికి నీళ్లు ఇస్తాము… రోడ్లు ఏస్తాము… సదువుకున్న పిలకాయలకి ఉజ్జోగాలిస్తాము… ఆంధ్రని జపాన్‌ జేస్తాము… సింగపూర్‌ జేస్తాము అని చెప్పడంలే… నవరత్నాలు… సూపర్‌ సిక్సులు… జనాలు ఇంకేం పని లేదు అనుకుంటా ఉండారు.. జనాలు జనాల గురించి అనుకోవడం లే… ఆలోచించడం లే… రాజకీయ నాయకుల మాదిరితో ఆలోసిస్తూ ఉండారు.. ఈ ఇదంగా ఉంటే ఎవురు గెలుస్తారు… రాజ”కీయం” గెలస్తాది. జనాలు ఈ ఇసయం తెల్సుకోవాల…. యాం తెలుసు కుంటారో యాందో….

➡️