ఎక్కడినుండో వచ్చి…సింహం నోటికి చిక్కి..

Feb 15,2024 21:39
ఎక్కడినుండో వచ్చి...సింహం నోటికి చిక్కి..

ఎస్వీ జూపార్కులో యువకుడు దుర్మరణంప్రజాశక్తి – తిరుపతి (మంగళం) శ్రీవారి దర్శనానికి వచ్చాడా.. లేదంటే ఇంకైదైనా పనిపైన తిరుపతికి వచ్చాడో తెలియదు.. రాజస్థాన్‌ రాష్ట్రం బన్సూర్‌ ఆల్వార్‌ జిల్లా తురానా గ్రామానికిచెందిన ప్రహ్లాద్‌ గుర్జార్‌ (38) తిరుపతి జూపార్కులో సింహం నోటికి బలయ్యాడు. సందర్శకులతో పాటు వచ్చిన ప్రహ్లాద్‌ గుర్జార్‌ ఒక్కమాటున 12 అడుగుల ఎన్‌క్లోజర్‌ గేటు దూకేశాడు. దొంగల్‌ పూర్‌ అనే మగ సింహం ఒక్కసారిగా దాడికి ఎగబడింది. ఈ హఠాత్‌ పరిణామంతో బిత్తరపోయిన ప్రహ్లాద్‌ గుర్జార్‌ చెట్టుఎక్కే ప్రయత్నం చేశాడు. అయితే సింహం అతన్ని కింద పడేసి ఛాతి భాగంలో గట్టిగా కొరకవడంతో ప్రాణాలు విడిచినట్లుగా తెలుస్తోంది. తిరుపతి రూరల్‌ పోలీసులకు అందిన సమాచారం మేరకు రూరల్‌ డిఎస్‌పి శరత్‌రాజ్‌ కుమార్‌ విచారణ చేపట్టారు. ప్రహ్లాద్‌ గుర్జార్‌ మృతదేహాన్ని పోస్టుమార్గం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. మృతుడు మానసిక పరిస్థితి సరిగ్గా లేక సింహం బోనులో దూకాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. అయితే క్రూర మృగాలు ఉన్న చోట కనీసం సిసి కెమెరాలు లేకపోవడం గమనార్హం. సిసి కెమెరాలు ఉంటే ప్రహ్లాద్‌ గుర్జార్‌ ఏ విధంగా మృతిచెందాడనేది అప్పటికప్పుడే తెలిసుండేది. ఎన్‌క్లోజర్‌ పైకి ఎక్కి సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నించాడా? లేక మద్యం తాగి ఉన్నాడా? మతి స్థిమితం లేక పడిపోయాడా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రహ్లాద చిరునామా సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దాడిచేసిన సింహాన్ని జంతుప్రదర్శనశాల బోన్‌లో బంధించారు.

➡️