ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలిఎస్‌బిఐ ఎదుట సిపిఎం ధర్నా

ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలిఎస్‌బిఐ ఎదుట సిపిఎం ధర్నాప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్‌ఐబి బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ధర్నా నిర్వహించింది. నిమిషాల్లో అయ్యే పనికి 116 రోజులు సమయం కావాలని ఎస్‌బిఐ కోరడం మోడీ కుట్రలో భాగమేనని మండిపడింది. పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్‌బిఐ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ధర్నా ఉద్దేశించి జిల్లా కార్యదర్శి వి.నాగరాజు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లుతో బిజెపి దగ్గర కోట్ల డబ్బులు పోగుపడి ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి మరోసారి ప్రజలను మోసం చేసి నెగ్గాలని చూస్తోందన్నారు. సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్దమని ప్రకటించినా, వివరాలు వెల్లడించడానికి ఎస్‌బిఐ మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. 2014-2019 మధ్యకాలంలో బిజెపికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 45 శాతం నిధులు వచ్చాయన్నారు. పదేళ్లలో 90శాతం ఎన్నికల బాండ్లు బిజెపికి వచ్చాయన్నారు. సుప్రీంకోర్టు అడిగినా బయట పెట్టడం లేదంటే ఎస్‌బిఐ బోన్‌లో నిలబడాల్సి వస్తుందన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో 350 నుండి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామని బిజెపి నేతలు అనడం అంటే రాజ్యాంగ పీఠికలో ఉన్న సెక్యులరిజం అనే పదాన్ని ఎత్తివేయడానికి పూర్తి మెజారిటీ అడుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కే వేణుగోపాల్‌, ఎన్‌ మాధవ్‌, పి చిన్న, ఏ రాధాకష్ణ, పార్థసారధి రెడ్డి, సిద్దు, రవి, అక్బర్‌, వెంకటేష్‌,బాల, శ్రీరాములు, రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో.. ఎస్‌బిఐ మెయిన్‌ బ్రాంచి ముందు సిపిఎం పట్టణ కార్యదర్శి గంధం మణి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని నినాదాలు చేశారు. నగడం గురవయ్య, కుమార్‌, వెలివేంద్రం, సంక్రాంతి వెంకటయ్య, గురునాధం తదితరులు పాల్గొన్నారు.

➡️