ఏపీ టూరిజంలోకి ప్రైవేటు బస్సులు

ఏపీ టూరిజంలోకి ప్రైవేటు బస్సులు

ఏపీ టూరిజంలోకి ప్రైవేటు బస్సులుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఎపి టూరిజంలోకి ప్రైవేట్‌ బస్సులు ప్రవేశిస్తున్నాయి. 15 ఎలక్ట్రికల్‌ బస్సుల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించారు. త్వరలోనే ఈ బస్సులూ రోడ్డెక్కనున్నాయి. తిరుపతి డివిజన్‌లో 15 బస్సులు లోకల్‌, నాన్‌ లోకల్‌గా ఎపి టూరిజం బస్సులు నడుస్తున్నాయి. ఇందులో డ్రైవర్లు, క్లీనర్లు, గ్యారేజి మెకానిక్‌లు మొత్తం 150 మంది పనిచేస్తున్నారు. ‘నీగో’ సంస్థకు చెందిన 15 ఎలక్ట్రికల్‌ బస్సులను కొనుగోలు చేసేందుకు టెండర్లకు ఆహ్వానించారు. ఎపి టూరిజం నేరుగా ‘నీగో’ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోలేదు. పలమనేరుకు చెందిన కళాధర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడో వ్యక్తితో ఒప్పందం కుదిరింది. భవిష్యత్‌లో మరో 15 బస్సులను ప్రైవేట్‌కు అప్పగించనున్నారు. అదే జరిగితే ప్రస్తుతం పనిచేస్తున్న 150 మంది కార్మికులు ఇంటి బాట పట్టాల్సిందే. ఎపి టూరిజం తిరుపతి డివిజన్‌ రాష్ట్రంలోనే అత్యంత ఆదాయం ఉన్న సంస్థ. దాదాపు 15 వోల్వా బస్సులు తిరుపతి – చెన్నరు, తిరుపతి – బెంగుళూరు, తిరుపతి – హైదరాబాద్‌, తిరుపతి- విజయవాడ మధ్య నడుస్తున్నాయి. డ్రైవర్లు, క్లీనర్లు, గ్యారేజి మెకానిక్‌లు మొత్తం కలిపి 150 మంది గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఎవరినీ పర్మినెంట్‌ చేయలేదు. వీరంతా ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. తిరుమల – తిరుపతి, కాణిపాకం- శ్రీకాళహస్తి, తిరుచానూరు – తలకోన, హార్సిలీహిల్స్‌, అప్పలాయగుంట, నారాయణవనం, నాగలాపురం, సురుటుపల్లి, ముక్కోటి తదితర ప్రాంతాల్లో బస్సులు నడుస్తాయి. ఐదు బస్సులు తప్ప మిగిలిన పది బస్సులు వోల్వా బస్సులే. స్పెషల్‌ దర్శనం బుక్‌ చేసుకున్న అందరూ ఈ బస్సుల్లోనే దర్శనానికి వెళతారు. ఎపి టూరిజం గైడ్లు ఈ బస్సుల్లో అందుబాటులో ఉంటారు. టిటిడికి, ఏపి టూరిజంకు ఒప్పందంలో భాగంగానే ఈ దర్శనాలు నడుస్తాయి. తిరుమలలో మూడు టూరిజం హోటల్స్‌ ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చాయి. ఆదాయం పెరగడంతో యాత్రికుల రద్దీ ఉండడంతో ‘ప్రైవేట్‌’ బస్సులు ఎపి టూరిజంలోకి ప్రవేశించే ఆలోచన జరిగింది. తాజాగా ఎలక్ట్రికల్‌ బస్సులు రావడంతో నీగో సంస్థకు చెందిన ఎలక్ట్రికల్‌ బస్సులకు టెండర్లను ఆహ్వానించారు. నేరుగా ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోకుండా మధ్యేమార్గంగా పలమనేరుకు చెందిన కళాధర్‌తో ఒప్పందం కుదిరింది. ఒక టూరిజం వోల్వా బస్సులు ఇద్దరు డ్రైవర్లు, ఒక గైడ్‌, ఒక క్లీనర్‌ ఉంటారు. ఈ ఎలక్ట్రికల్‌ బస్సుల్లో ఒకే డ్రైవర్‌తో నడవనున్నాయి. గ్యారేజి సైతం ప్రైవేట్‌ వ్యక్తుల వద్దనే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ‘ప్రైవేట్‌’ ఎలక్ట్రికల్‌ బస్సులు ప్రవేశిస్తే ‘ఎపి టూరిజం’ బస్సులు ఇంటి దారి పట్టక తప్పదన్న చర్చ నడుస్తోంది. ఒక్కరినీ తొలగించం : గిరిధర్‌రెడ్డి, డివిజన్‌ మేనేజర్‌ ప్రైవేట్‌, ఎలక్ట్రికల్‌ బస్సులను ఆహ్వానించిన మాట వాస్తవమే. త్వరలోనే ఈ బస్సులు ఎపి టూరిజంలోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న బస్సులను తొలగించి రవాణా వ్యవస్థ మొత్తం ‘ప్రైవేట్‌’కు ఇవ్వబోం. ఒక్కరినీ తొలగించే ప్రసక్తే లేదు. ఎలక్ట్రికల్‌ బస్సులు లోకల్‌, నాన్‌ లోకల్‌గా తిరగనున్నాయి. ప్రస్తుతం ఏపి టూరిజం పరిధిలో ఉన్న బస్సులు రన్నింగ్‌లో ఉంటాయి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.

➡️