క్షురకుల నియామకానికి యానాదయ్య అడ్డు

Mar 30,2024 23:29
క్షురకుల నియామకానికి యానాదయ్య అడ్డు

క్షురకుల నియామకానికి యానాదయ్య అడ్డుప్రజాశక్తి-తిరుపతి(మంగళం)రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరినందుకు తొమ్మిదిమంది నాయి బ్రాహ్మణులను తిరుమల కళ్యాణకట్ట నుంచి తొలగించారని, వారిని పున్ణనియామకానికి బోర్డు ఆదేశించినా ఓ ఓటు సభ్యుడిగా, సాటి కులస్తుడిగా అడ్డుపడడం యానాదయ్యకు తగునా అని టీటీడీ మహిళా క్షరకుల వ్యవస్థాపక అధ్యక్షురాలు కె. రాధాదేవి ప్రశ్నించారు. శనివారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన విలేకరుల సమావేశంలో నాయి బ్రాహ్మణులకు 20వేల జీతాన్ని అందిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. టిటిడి బోర్డు చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తొలగించిన తొమ్మిది మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని మాట ఇచ్చిన అమలు పరచక పోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 110 జీవో ప్రకారం వేతనాలు చెల్లింపు జరుగుతుందని చెప్పి కార్పొరేషన్‌ లో ఉన్న 18 మందికి మాత్రమే జీవో ప్రకారం జీతాలు చెల్లించడంలో దాగి ఉన్న రహస్యం ఏందో బహిర్గతం చేయాలన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌ చైర్మన్గా కొనసాగుతున్న తొండమల్ల పుల్లయ్య తిరుమలలోని కళ్యాణకట్టలోకి వెళ్లి తిరుపతి వైఎస్‌ఆర్సిపి అభ్యర్థిగా బరిలో ఉన్న భూమన అభినయ రెడ్డి ఇంటి వద్దకు రావాలని, ఎన్నికల్లో అభినయ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని కోరడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిటిడి పాలకమండలి సభ్యుడుగా తన సొంత ప్రయోజనాలను చక్కబెట్టుకోవడానికి యానాదయ్య పని చేస్తున్నారని, నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏమాత్రం కాదని స్పష్టం చేశారు. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే తగిన కార్యచరణతో ముందుకెళతానని హెచ్చరించారు.

➡️