తక్కువ ఖర్చు.. సుస్థిర కార్గో సేవలు

Dec 21,2023 22:22
తక్కువ ఖర్చు.. సుస్థిర కార్గో సేవలు

– శ్రీసిటీ-సిద్ధార్థ లాజిస్టిక్స్‌ పరిశ్రమలో అధునాతన ”డ్రై పోర్ట్‌” సదుపాయం – ఈ ప్రాంత వాణిజ్య వద్ధి, విస్తరణకు అత్యంత ప్రయోజనకరంప్రజాశక్తి-వరదయ్యపాలెం: 28 దేశాలకు చెందిన 210 పైచిలుకు పరిశ్రమలతో పారిశ్రామిక ప్రగతితో ముందుకుపోతున్న శ్రీసిటీతో పాటు, శ్రీసిటీ జంక్షన్‌ గా చెన్నై-తిరుపతి-నెల్లూరును కలుపుతూ ట్రై-సిటీ పారిశ్రామిక కారిడార్‌కు కూడా వేగంగా అడుగులు పడుతోంది. దీంతో ఈ ప్రాంతంలో బలమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ నెలకొంది. ఫలితంగా అపోలో టైర్స్‌, హీరో మోటార్స్‌ వంటి కంపెనీల ఏర్పాటుతో పాటు ఆటోమోటివ్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు చెందిన పలు పరిశ్రమలు తమ ప్లాంట్ల స్థాపనకు మొగ్గుచూపుతున్నాయి. దీంతో కార్గో సేవలకు డిమాండ్‌ ఎక్కువవుతోంది. శ్రీసిటీ ద్వారా మాత్రమే అంతర్జాతీయ కార్గో ట్రాఫిక్‌ ఏడాదికి సుమారు 1,20,000 కంటైనర్లకు చేరుకుంది. చెన్నై, ఎన్నూర్‌, కట్టుపల్లి, కష్ణపట్నంతో సహా కీలకమైన ఓడరేవుల అనుసందానం ఉన్నప్పటికీ, కార్గోలను రవాణా చేయడంలో పలు సవాళ్లను ఎదుర్కొవలసివుంది, రవాణా సమయం, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. ఏర్పాటైన ”డ్రైపోర్ట్‌”:కార్గో సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ”డ్రై పోర్ట్‌” గా పిలువబడే ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది సమగ్ర లాజిస్టిక్స్‌ సెంటర్‌గా పనిచేస్తుంది. ఓడరేవు తరహా సౌకర్యాలను కలిగివుండడం, సమర్థవంతంగా సులభతర కార్గో సేవల నిర్వహణ, రవాణా ఖర్చు, సమయాన్ని తగ్గించడం దీని ప్రత్యేకత. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌ డైరెక్ట్‌ ట్యాక్సస్‌, కస్టమ్స్‌ నిబంధనల మేరకు ఓడ రేవులకు 200 కిలోమీటర్ల లోపులకు అనుమతి లేదు. అయితే, కస్టమ్స్‌ చట్టం నిబంధనల ప్రకారం, శ్రీసిటీలోని ‘ఫ్రీ ట్రేడ్‌ వేర్‌ హౌసింగ్‌ జోన్‌’ లో ఉన్న సిద్ధార్థ లాజిస్టిక్స్‌ ఎర్పాటు చేసుకున్న ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో (డ్రై పోర్ట్‌) వంటి సదుపాయానికి, 200 కిలోమీటర్ల పరిధి నిబంధన వర్తించదు. ఈ మేరకు సిద్ధార్థ లాజిస్టిక్స్‌ పరిశ్రమ డ్రై పోర్ట్‌ను నిర్వహించేందుకు అనుమతి పొంది, అధునాతన సదుపాయాలతో పెద్ద ఎత్తున కార్యకలాపాలను మొదలుపెట్టింది.

➡️