నమ్మినందుకు…నడిరోడ్డుపై..!అంగన్‌వాడీల రాస్తారోకో, అరెస్టు

నమ్మినందుకు...నడిరోడ్డుపై..!అంగన్‌వాడీల రాస్తారోకో, అరెస్టు

నమ్మినందుకు…నడిరోడ్డుపై..!అంగన్‌వాడీల రాస్తారోకో, అరెస్టు ప్రజాశక్తి – యంత్రాంగం నాయుడుపేట అంబేద్కర్‌ బొమ్మనుంచి అమరావతి సెంటర్‌ వరకూ ర్యాలీచేపట్టి అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ప్రాజెక్టు కార్యదర్శి నెలవల శ్యామలమ్మ, సిఐటియు నాయకులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 11 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. సమస్య పరిష్కరించని పక్షంలో ఈనెల 25 నుంచి పది వామపక్ష పార్టీలు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నాయని హెచ్చరించారు. రాస్తారోకో సందర్భంగా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశంచేసి నాయకులను అరెస్టు చేశారు. సిఐటియు జిల్లా నాయకులు శివకవి ముకుంద, చాపల వెంకటేశ్వర్లు, ఎన్‌.శ్యామలమ్మ, ఐద్వా నాయకురాలు చేజర్ల చంద్రకళను బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపులో ఎక్కించి పోలీసు స్టేషన్‌ తరలించే ప్రయత్నం చేయగా అంగన్‌వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. – పుత్తూరులో సిఐటియు నాయకులు ఆర్‌.వెంకటేష్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు రాస్తారోకో నిర్వహించారు. మునికుమారి, రాధ, ధనమ్మ, పద్మజ, అన్నపూర్ణ, మోహన్‌లక్ష్మి, హైమావతి, గంగులమ్మ పాల్గొన్నారు. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో పోలీసులు రాస్తారోకోను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. – పిచ్చాటూరులో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలకు యుటిఎఫ్‌ ఉపాధ్యాయ బృందం సంఘీభావం ప్రకటించింది. నరేష్‌కుమార్‌ మాట్లాడుతూ పల్లెల్లో విద్యార్థులు అంచెలంచెలుగా ఎదిగి యూనివర్సిటీ స్థాయిలో చదువుతున్నారంటే అంగన్‌వాడీలే కారణమన్నారు. సిఐటియు నాయకులు నాగరాజు, రామచంద్రారెడ్డి, యూనియన్‌ నాయకులు శ్రీవాణి, పూర్ణమ్మ,కల్యాణి పాల్గొన్నారు. – శ్రీకాళహస్తి ఎపి సీడ్స్‌ సర్కిల్‌ పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎంత బెదిరించినా తగ్గేదేలే అంటూ రెట్టించిన ఉత్సాహంతో నిరసన తెలిపారు. ఓ అన్నగా జగనన్నను నమ్మినందుకు అందరినీ నడిరోడ్డులో నిలబెట్టారన్నారు. సిఐటియు నాయకులు అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, గంధం మణి, వేణు, రేవతి, పుష్ప, సౌజన్య, ఐఎఫ్‌టియు నాయకులు భారతి, సక్కుభాయమ్మ పాల్గొన్నారు. – గూడూరు టౌన్‌లో దీక్షా శిబిరం వద్ద సిఐటియు ఆటో కార్మిక సంఘం వెయ్యి రూపాయలు, ఆశా వర్కర్లు 1500 ఆర్థిక సాయాన్ని అంగన్‌వాడీ అధ్యక్షురాలు ఎ.ఇంద్రావతికి అందజేశారు. కాంగ్రెస్‌, జనసేన నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం, రైతుసంఘం నాయకులు జోగి శివకుమార్‌, ఆటో సంఘం నాయకులు బి.రమేష్‌, బి.చంద్రయ్య, గుర్రం రమణయ్య, సెక్టార్‌ లీడర్లు అరుణ, లక్ష్మి పాల్గొన్నారు. – కోటలో అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యాలయం నుండి బజారు వరకు ర్యాలీ చేపట్టారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అంగన్‌వాడీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మండల అధ్యక్షురాలు పద్మలీలమ్మ, సరోజినీ పాల్గొన్నారు. రేణిగుంటలో..అంబేద్కర్‌ విగ్రహం సర్కిల్‌పై రాస్తారోకో నిర్వహించారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ, ఐఎఫ్‌టియు నాయకురాలు అరుణమ్మ, సిఐటియు మండల కార్యదర్శి కె.హరినాథ్‌, ఒ.వెంకటరమణలు నాయకత్వం వహించారు. వాణిశ్రీ మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కనీస వేతనం 26వేలివ్వాలని డిమాండ్‌చేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల వాగ్దానం తప్పడం వల్లనే అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ ప్రాజెక్టు అధ్యక్షురాలు ధనమ్మ, ఐ ఎఫ్‌ టి యు కార్యదర్శి రాధా పాల్గొన్నారు.- తిరుపతి టౌన్‌లో.. తిరుపతి పాత మున్సిపల్‌ కార్యాలయం ముందు రాజీవ్‌గాంధీ సర్కిల్‌ దగ్గర అంగన్‌వాడీలు రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎంఎల్‌సి కత్తి నరసింహారెడ్డి, గంట మోహన్‌ మద్దతు ప్రకటించారు. సిఐటియు నగర నాయకులు టి.సుబ్రమణ్యం, వేణుగోపాల్‌, బుజ్జి, తంజావూరు మురళి పాల్గొన్నారు. ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ చిత్త విజరు ప్రతాప్‌ రెడ్డి అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మల పట్ల నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రంలో ఎక్కడా తిరగనీకుండా చేస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీ నాయకులు నాగరాజమ్మ, అరుణ, గోమతి, గీత, రాజేశ్వరి పాల్గొన్నారు. – వెంకటగిరిలోకాంగ్రెస్‌ నాయకులు మద్దతు ప్రకటించారు. సిఐటియు నాయకులు వడ్డిపల్లిచెంగయ్య, వెంకటగిరి ప్రాజెక్టు అధ్యక్షులు ఎ.మంజుల, మండల అధ్యక్షులు సుభాషిణి, ఐఎఫ్‌టియు అధ్యక్ష కార్యదర్శులు ముమ్ములాబేగం, లక్ష్మీప్రసన్న నాయకత్వం వహించారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పంట శ్రీనివాసులురెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూల చంద్రశేఖర్‌ సంఘీభావం ప్రకటించారు.

➡️