పెండింగ్‌ బకాయిలు ఇవ్వాలని యుటిఎఫ్‌ ధర్నాలు

పెండింగ్‌ బకాయిలు ఇవ్వాలని యుటిఎఫ్‌ ధర్నాలుప్రజాశక్తి – సూళ్లూరుపేటఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు అన్ని తాలూకా కేంద్రాల్లో, డివిజన్‌ కేంద్రాల్లో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ధర్నా కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా యుటిఎఫ్‌ తడ,సూళ్లూరుపేట దొరవారిసత్రం మండల శాఖల ఆధ్వర్యంలో సూళ్లూరుపేట తహసిల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఉద్యోగస్తులకు పెండింగ్‌ లో ఉన్న డీఏ బకాయిలు, సరండర్‌ లీవ్‌ బకాయిలు, పిఆర్సి బకాయిలు, జెడ్పిపిఎఫ్‌ క్లోసింగ్‌ బకాయిలు, లోన్ల బకాయిలు ఏపీ జి ఎల్‌ ఐ క్లోజింగ్‌ బకాయిలు, మెడికల్‌ రీయంబర్స్మెంట్‌ బకాయిలు సుమారుగా 18 వేల కోట్లు పైగా ఆగిపోయి ఉన్నాయన్నారు. ఉద్యోగస్తులకు పెన్షనర్లకు ఒకటో తేదీన సకాలంలో జీతాలు చెల్లించడం లేదన్నారు.ఈ ప్రభుత్వము పాదయాత్రలో ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చక పోగా,వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తానని చెప్పి, దుర్మార్గమైన జిపిఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగక జనవరి 3న జిల్లా కేంద్రాల్లోనూ, జనవరి 9,10 తేదీల్లో రాష్ట్ర కేంద్రంలో ఉధతంగా జరుగుతుందని యుటిఎఫ్‌ తిరుపతి జిల్లా గౌరవాధ్యక్షులు కే.శేఖర్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కావూరు ప్రభాకర్‌, మూడు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.రామ్మూర్తి,సి.హెచ్‌ జనార్దన్‌, కేటి నవీన్‌ కుమార్‌, రాంబాబు, దిలీప్‌ కుమార్‌, హుస్సేన్‌ భాషా, ఓంకారం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు బి.పద్మనాభయ్య, పెన్షనర్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జందెం వాసుదేవరావు, విజ్ఞాన వేదిక అధ్యక్షులు రాజేష్‌బాబు మద్దతు ప్రకటించారు.ఎంఆర్‌ఒకు వినతిపత్రం అందజేశారు. – పుత్తూరు టౌన్‌లో పుత్తూరు ఎమ్మార్వో ఆఫీస్‌ ఎదుట నిరసన తెలిపి తహశీల్దార్‌ పరమేశ్వర స్వామికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్‌ నాయుడు, జిల్లా సహాధ్యక్షులు కందల శ్రీదేవి, దాసరి మునెయ్య పాల్గొన్నారు. – గూడూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తిల్లోనూ నిరసనలు జరిగాయి.

➡️