మాలో ఎవరికిచ్చినా సరే..!బొజ్జల సుధీర్‌ రెడ్డికి మద్దతివ్వం కూటమి అసమ్మతి నేతల నిర్ణయం

మాలో ఎవరికిచ్చినా సరే..!బొజ్జల సుధీర్‌ రెడ్డికి మద్దతివ్వం కూటమి అసమ్మతి నేతల నిర్ణయం

మాలో ఎవరికిచ్చినా సరే..!బొజ్జల సుధీర్‌ రెడ్డికి మద్దతివ్వం కూటమి అసమ్మతి నేతల నిర్ణయంప్రజాశక్తి-శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డికి మద్దతు ఇవ్వబోమనీ, మిగిలిన వారిలో అధిష్టానం ఎవరిని నిర్ణయించినా విజయానికి కషి చేస్తామని కూటమి అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీనాయుడు, సత్రవాడ మునిరామయ్య, జనసేన నియోజక వర్గం ఇన్‌ ఛార్జి వినుత కోటా, బీజేపీ జిల్లా కార్యదర్శి మేళాగారం సుబ్రహ్మణ్యంరెడ్డి తమ అనుచరులతో పట్టణంలోని నగరివీధిలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీవీనాయుడు మాట్లాడుతూ బొజ్జల కుటుంబం వంశపారపర్యంగా శ్రీకాళహస్తిలో రాజకీయం చేస్తోందన్నారు. ప్రస్తుతం బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. తనకు వయసు రీత్యా ఒక అవకాశం కల్పిస్తే గెలిచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు చేసిన సేవా కార్యక్రమాలు తన విజయానికి దోహద పడతాయని ఎస్సీవీ అభిప్రాయపడ్డారు. ఇక జనసేన నియోజకవకర్గం ఇన్‌ ఛార్జి వినుత కోటా మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా తన పేరు జనసేన అధిష్టానం పరిశీలిస్తోందన్నారు. అందులో భాగంగానే తనను శుక్రవారం మంగళగిరి ప్రధాన కార్యాలయానికి రమ్మని అధిష్టానం పిలిచిందన్నారు. ఇక బీజేపీ జిల్లా కార్యదర్శి మేళాగారం సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్‌ పేరు పరిశీలనలో ఉందనీ, అందుకే ఆయన ఢిల్లీలో ఉన్నారన్నారు. పొత్తులో భాగంగా ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలసి పని చేయాలని అసమ్మతి నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. కాగా అసమ్మతి నేతల తీరు శ్రీకాళహస్తిలో చర్చనీయాంశంగా మారింది. పొత్తుల్లో భాగంగా అధిష్టానం కూటమి అభ్యర్థిని ప్రకటించిన తరువాత ఇలా ధిక్కరించడం ఏమిటని శ్రీకాళహస్తి వాసులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థికి లాభం చేకూర్చాలనే చెడు ఉద్దేశ్యంతోనే కూటమి అసమ్మతి నేతలు ఇలా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

➡️