మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి.

మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి.

మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి..ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం మున్సిపల్‌ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో సిబ్బంది సమ్మెలోకి వెళ్లారన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ హరితకు వినతిపత్రం ఇచ్చారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్‌, ఉపాధ్యక్షులు టి.సుబ్రమణ్యం మాట్లాడుతూ పెరిగిన ధరల నేపథ్యంలో మున్సిపల్‌ కార్మికులు చాలీచాలని వేతనాలతో బతుకు జీవనం సాగిస్తున్నారన్నారు. మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని సిఎం హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లయినా పట్టించుకోలేదన్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయని, ఈ నేపథ్యంలో సమ్మె తప్ప మరో మార్గం లేకనే సమ్మె చేస్తున్నామన్నారు. ఆప్కాస్‌ ఉద్యోగులనే పేరిట మున్సిపల్‌ కార్మికులను సంక్షేమ పథకాలకు దూరం పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి బుజ్జి, పి చిన్న, తంజావూరు మురళి, ఎండి శ్రీనివాసులు, రమేష్‌, రాధాకష్ణ, జయంతి, మల్లికార్జున రావు, పార్థసారథి, భగత్‌, రవి, మనీమాల తదితరులు పాల్గొన్నారు.- పుత్తూరులో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాంట్రాక్టు వర్కర్లను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, రిటైర్‌ అయిన తరువాత పెన్షన్‌ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేశు, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు గణేష్‌ పాల్గొన్నారు. – శ్రీకాళహస్తిలో నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. సిఐటియు, ఎఐటియుసి అనుబంధ సంఘాల మున్సిపల్‌ పారిశుధ్య విభాగం కార్మికులు నిరసనలో పాల్గొన్నారు. సిఐటియు అనుబంధ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గోపీనాధ్‌ ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 50వేల మంది పారిశుధ్య విభాగం కార్మికులు రోడ్డెక్కారన్నారు. కోవిడ్‌ సమయంలో మీకు మించిన వారియర్స్‌ లేరని వేన్నోళ్లు పొగిడిన జగన్‌, మీకు లక్ష జీతం ఇచ్చినా తక్కువేనని చెప్పారన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు గడిచిపోతున్నా ఇచ్చిన హామీలను ఎందుకు మరిచారని మండిపడ్డారు. డిమాండ్లను సత్వరమే పరిష్కరించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు జనమాల గురవయ్య, మించల శివకుమార్‌, సిఐటియు నాయకులు అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, గంధం మణి, వెంకటేష్‌, కుమార్‌ పాల్గొన్నారు. – గూడూరు టౌన్‌లో రిలేదీక్షలు చేపట్టారు. సిఐటియు నాయకులు సురేష్‌, సిపిఎం సెంట్రల్‌ కార్యదర్శి జోగి శివకుమార్‌ మాట్లాడుతూ ఒప్పంద కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్మికుడు చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఇంజినీరింగ్‌ సిబ్బందికి అలవెన్స్‌లు ఇవ్వాలన్నారు. సిపిఎస్‌ను రద్దు చేయాలన్నారు. క్లాప్‌ డ్రైవర్లకు 18,500వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నాయకులు మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గోపీనాధ్‌, పెంచల ప్రసాద్‌, మురళి, అడపాల ప్రసాద్‌ పాల్గొన్నారు. – నాయుడుపేటలో యూనియన్‌ గౌరవాధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించారన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కార్మికవర్గం వైసిపి ప్రభుత్వాన్ని ఓట్లతో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులుగా బడుగు బలహీన వర్గాల వారే పనిచేస్తునారని, వారి సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. డివైఎఫ్‌ఐ నాయకులు బాలచంగయ్య మద్దతు తెలిపారు. నాయకులు వెంకటరత్నం, మైలారి శ్రీనివాసులు, నెలవల మస్తానయ్య పాల్గొన్నారు. – వెంకటగిరిలో సిఐటియు నాయకులు వడ్డిపల్లి చెంగయ్య ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు నిరసన తెలిపారు. ఎపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు టి.సుబ్బయ్య, కార్యదర్శి ఎస్‌.ప్రసాద్‌ పాల్గొన్నారు. – సూళ్లూరుపేటలో సిఐటియు గౌరవాధ్యక్షులు కె.సాంబశివయ్య, బి.పద్మనాభయ్య, అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య, కె.లక్ష్మయ్య నాయకత్వం వహించి సంఘీభావం తెలిపారు. యుటిఎఫ్‌ నాయకులు రాజశేఖర్‌, ప్రభాకర్‌బాబు సంఘీభావం ప్రకటించారు.

➡️