నిద్రపట్టని కాంట్రాక్టర్లుఆగిన రూ.60 కోట్ల బిల్లులు’ఆరణి’ లేఖ ఎఫెక్ట్‌

నిద్రపట్టని కాంట్రాక్టర్లుఆగిన రూ.60 కోట్ల బిల్లులు’ఆరణి’ లేఖ ఎఫెక్ట్‌ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌జూన్‌ 4 కౌంటింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.. అయితే కాంట్రాక్టర్లకు మాత్రం నిద్ర పట్టడం లేదు.. రాష్ట్రంలో అధికారంలోకి ఎవరొస్తారు..? తిరుపతిలో ఎవరు గెలుస్తారు? అనే టెన్షన్‌ వారికి నిద్ర రానీయడం లేదు. దాదాపు 60 కోట్ల రూపాయల బిల్లులు కాంట్రాక్టర్లకు రావాల్సి ఉంది. ఇప్పటికే జనసేన ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎన్నికల సమయంలో కార్పొరేషన్‌ కాంట్రాక్టర్ల బిల్లులను ఎటువంటి పరిస్థితుల్లో చెల్లించవద్దని కమిషనర్‌ అదితిసింగ్‌కు లేఖ రాశారు. కాదని ముందుకెళితే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు. దీంతో వైసిపి హయాంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లుల పరిస్థితి ఎలా ఉంటుందోనని కాంట్రాక్టర్లలో గుబులు నెలకొంది. ఆరణి శ్రీనివాసులు సైతం గతంలో క్లాస్‌ వన్‌ కాంట్రాక్టర్‌ అయి ఉండి, ఇలా చేయడం సబబు కాదని మున్సిపల్‌ కాంట్రాక్టర్లు వాపోతున్నారు. సాటి కాంట్రాక్టర్ల సమస్య ఆరణికి పట్టలేదన్నది వారి ఆవేదన. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏడాదిగా కార్పొరేషన్‌ అధికారులు కాంట్రాక్టర్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో ఇక్కడ ఉన్న కమిషనర్‌ హరిత, ఇతర అధికారులు బదిలీ కావడంతో పనులు పూర్తయినా వీరికి బిల్లులు సకాలంలో ఇవ్వలేదు. అప్పులు చేసి వడ్డీలు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల జాప్యంతో ఇబ్బందులు పడుతున్నారు. మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల పేరుతో మున్సిపల్‌ ఖజానా ఖాళీ అయ్యింది. కాంట్రాక్టర్లు ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మరీ అభివృద్ధి పనులకు వెచ్చించారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రతిరోజూ కార్పొరేషన్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పిల్లల పెళ్లిళ్లకు, ఆస్పత్రులకు సైతం కొంతమంది కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారు. కొంతమంది దిగులుతో అనారోగ్యం పాలయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కమిషనర్‌కు లేఖ రాయడంతో అదితిసింగ్‌ సైతం బిల్లుల చెల్లింపుకు సాహసం చేయలేకపోయారని తెలుస్తోంది. కొంతమంది బడా కాంట్రాక్టర్లకు ఎంతోకొంత బిల్లులు ఇచ్చారని తెలుస్తోంది. చిన్నాచితక అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టిన కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు అందక మల్లగుల్లాలు పడుతున్నారు. శనివారం కార్పొరేషన్‌ కమిషనర్‌ అదితిసింగ్‌ను కలిసి తమకు బిల్లులు చెల్లించాలని మొరపెట్టుకున్నారు. అవకాశాలను పరిశీలిస్తామని కమిషనర్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

➡️