రంగురాళ్లా..వజ్రాలా..!’మెగా’ …ఖ’నిజం’ తేల్చాలిశ్రీ కాసరం చెరువులో గప్‌చిప్‌గా తరలింపు శ్రీ గ్రామస్తులు అడ్డుకున్నా బేఖాతర్‌

రంగురాళ్లా..వజ్రాలా..!'మెగా' ...ఖ'నిజం' తేల్చాలిశ్రీ కాసరం చెరువులో గప్‌చిప్‌గా తరలింపు శ్రీ గ్రామస్తులు అడ్డుకున్నా బేఖాతర్‌

రంగురాళ్లా..వజ్రాలా..!’మెగా’ …ఖ’నిజం’ తేల్చాలిశ్రీ కాసరం చెరువులో గప్‌చిప్‌గా తరలింపు శ్రీ గ్రామస్తులు అడ్డుకున్నా బేఖాతర్‌ప్రజాశక్తి-శ్రీకాళహస్తి/తొట్టంబేడు మెగా మట్టి మాఫియా నానాటికీ మితిమీరిపోతోంది. మెగా మట్టి దోపిడీపై పత్రికల్లో, టీవీల్లో వరుస కథనాలు వస్తున్నా రెట్టించిన ఉత్సాహంతో అక్రమాలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో మట్టే కాదు తవ్వకాల్లో లభించే ఖనిజాలను సైతం అమ్మేసుకునే స్థాయికి మెగా యాజమాన్యం చేరుకోవడం గమనార్హం. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కాసరం చెరువులో మెగా తవ్వాకాల్లో బయటపడ్డ విలువైన రాయిని దొంగలిస్తూ చివరకు గ్రామస్తులకు పట్టుబడ్డ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఇది వజ్రపు రాయిగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తుండటం కొసమెరుపు. వివరాల్లోకి పోతే…మెగా సంస్థ నాయుడుపేట నుంచి మదనపల్లి వరకు ఆరు లైన్ల రోడ్డును ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ విదితమే. మొదటి దశలో భాగంగా ఈ పనులను ప్రముఖ సంస్థ మెగా కంపెనీ రూ.5 వేల కోట్ల వ్యయంతో చేపడుతోంది. ఇప్పటికే 50 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. అయితే పనులను చేసే సమయంలో వీరికి అవసరమైన మట్టిని చెరువుల నుంచి ఇష్టారాజ్యంగా తరలించడంతో చెరువులు లోయలుగా మారిపోతున్నాయి. దీంతో ఇటీవల శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివోలు చెరువులో మట్టి తవ్వకాలు చేపట్టడంతో చెరువులో దిగి లోతు తెలియకుండా తల్లి కూతుర్లు మతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తొట్టంబేడు మండలంలోని కాసరం చెరువులో గత రెండు నెలల నుంచి భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. కొందరు అధికార పార్టీ నాయకుల సాయంతో ఈ తతంగం సాగుతోంది. ఏ గ్రామంలో అయినా మట్టిని తరలించాలంటే ఆ పంచాయతీకి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం ఉంది. అయితే ఎలాంటి రాయల్టీని కాసరం పంచాయతీకి చెల్లించకుండా కొందరు అధికార పార్టీ నాయకుల సహకారంతో మట్టిని తరలిస్తున్నారు. దీంతో మంగళవారం మట్టి తరలింపుల్లో భాగంగా కొన్ని విలువైన రాళ్లు బయటపడ్డాయి. వాటిని గుట్టు చప్పుడు కాకుండా మెగా యాజమాన్యం ఊరు దాటించినట్లు సమాచారం. సుమారు మూడు టిప్పర్ల రాళ్ళను అక్రమంగా తరలించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తొట్టంబేడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన ఎస్సై రాఘవేంద్ర మట్టి తరలిస్తున్న టిప్పర్ను స్వాధీనం చేసుకుని అందులో ఉన్న రాళ్లను పరిశీలించారు. అయితే అది ఏ రకం రాయో తెలియక పోలీసులు రెవెన్యూ అధికారులకు అప్పజెప్పారు. నాయుడు పేట నుంచి రేణిగుంట వరకు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా మెగా కంపెనీ మట్టి తవ్వకాలు ఎక్కువయ్యాయి. గతంలో గుండేలి గుంట పంచాయతీ చెరువులో భారీ టిప్పర్లు పెట్టి మట్టిని తరలించేశారు. ప్రస్తుతం చెరువు మొత్తం వర్షపు నీరు చేరి ఎంత లోతు ఉందో కూడా తెలియలేని పరిస్థితి. ఈ క్రమంలో గత రెండు నెలలుగా మెగా కంపెనీ కాసరం చెరువులో మట్టి తవ్వకాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బయటపడిన రాళ్ల విలువ కోట్ల రూపాయల ఉంటుందని ఊహాగానాలు వినపడుతున్నాయి. అయితే మంగళవారం ఒక్కరోజేనా లేక గత రెండు నెలలుగా జరిపిన తవ్వకాల్లో విలువైన రాళ్లు కూడా ఉన్నాయా..? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. టిప్పర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని విషయం తెలియగానే మెగా కంపెనీలో పనిచేస్తున్న ఓ ప్రతినిధి పోలీస్‌ స్టేషన్కు వచ్చి ఎస్‌ఐతో మాట్లాడినట్లు సమాచారం. మెగా కంపెనీ చేపడుతున్న రోడ్డు పనులకు మట్టి అవసరమే కానీ మట్టితో పాటు ఈ విలువైన రాళ్లును గుర్తించాలంటే మైనింగ్‌ అధికారులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పోలీసులు మాత్రం ఇది సున్నపు రాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ సంఘటనపై కేసు కూడా నమోదు చేయలేదు. మెగా యాజమాన్యం రాయి చౌర్యం వివాదం నుంచి బయటపడేందుకు భారీగానే లాబీయింగ్‌ నడుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా నిజానిజాలు తెలియాలంటే పురావస్తు శాఖ, మైనింగ్‌, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కాసరం గ్రామానికి చేరుకుని చెరువు తవ్వకాల్లో బయటపడిన రాళ్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

➡️