విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల ధర్నా

విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల ధర్నా

విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల ధర్నాప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు, స్టోర్‌ హమాలీలు ఏపీ ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట సోమవారం యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాను చేపట్టారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పిన ఏ హామీని అమలు చేయలేదని, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్‌ మూడు నెలల్లో ప్రకటిస్తామని చెప్పి నాలుగున్నర సంవత్సరాలు కావస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులను మోసగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. ఎన్నికలకు ముందు విద్యుత్‌ కార్మికులు అత్యంత కీలకమైన వారని, ఆదుకోవడం తన మొదటి కర్తవ్యమని కథలు చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి… అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. జగన్మోహన్‌ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందర్నీ రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్‌ ప్రసంగిస్తూ కాంట్రాక్ట్‌ కార్మికులు రెక్కలు, ముక్కలు చేసుకుని దశాబ్ద కాలానికి పైగా పని చేస్తుంటే రెగ్యులరైజేషన్‌కు నోచుకోకపోవడం దారుణమని అన్నారు. తక్షణం తమ సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రంలో విద్యుత్‌ కార్మికులు సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంట్రాక్ట్‌ కార్మికులు సాగిస్తున్న పోరాటానికి యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ పర్మినెంటు ఉద్యోగుల సంఘం తరపున మద్దతు ప్రకటించారు. శివప్రసాద్‌ రెడ్డి, పెంచల ప్రసాద్‌ లు ప్రసంగిస్తూ సంఘీభావం తెలిపారు. అనంతరం సీఎండి కె.సంతోషరావుకు కార్మికులు వినతిపత్రం సమర్పించారు. ఆయన స్పందించి తన పరిధిలోని అన్ని అంశాలను పరిష్కరిస్తానని మిగిలిన విషయాలు ప్రభుత్వానికి లేఖ రాస్తామని సీఎండి తెలిపారు. విద్యుత్‌ కార్మికుల ధర్నా కార్యక్రమం దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీసులను పెద్ద ఎత్తున మోహరింప చేశారు. సిఐటియు నగర కార్యదర్శి కే. వేణుగోపాల్‌, స్టోర్‌ హమాలీల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఆరోగ్యదాస్‌, యూనియన్‌ జిల్లా అధ్యక్షులు నారాయణ, ఖాదిర్‌, సుదర్శన్‌ బాబు, ప్రసాద్‌, రవికుమార్‌, చిరంజీవి, మురళి, సోము, భార్గవ్‌, వినోద్‌ పాల్గొన్నారు.

➡️