వ్యవసాయశాఖ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పనితీరులో జిల్లాకు మొదటిస్థానం: కలెక్టర్‌

Feb 17,2024 23:03
వ్యవసాయశాఖ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పనితీరులో జిల్లాకు మొదటిస్థానం: కలెక్టర్‌

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: వ్యవసాయశాఖ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పనితీరులో జిల్లాకు మొదటి స్థానం దక్కడం గర్వకారణమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆధర్వంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, అనుబంధశాఖల అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు భరోసా కేంద్రాలు, రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు, రాయితీ పై, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా తదితర అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యవసాయశాఖ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పనితీరులో జిల్లాకు మొదటిస్థానం దక్కడం గర్వకారణంగా ఉందని వ్యవసాయశాఖ వారికి అభినందలు తెలిపారు. జిల్లాస్థాయిలో వ్యవసాయ సలహా మండలి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి రైతులు అవసరమైన సలహాలు, సూచనలు పొందే గొప్ప కార్యక్రమమని అన్నారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి అవసరమైన అన్ని సేవలను రైతులకు అందుబాటులో ఉంచామని జిల్లా కలెక్టర్‌కి వివరించారు. రబీ ప్రధానపంట అయినా వరి రెండులక్షల ఎకరాల్లో సాగు అవుతుందని తెలిపారు. జిల్లాలో ప్రతి పంటకు 100శాతం ఈ క్రాపింగ్‌, ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. ఈ సమీక్షలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, జిల్లా సిరికల్చర్‌ అధికారి గీతారాణి, మైక్రో ఇరిగేషన్‌ శాఖ అధికారి సతీష్‌, నీటిపారుదల శాఖ అధికారి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

➡️