1న తిరుపతిలో కాంగ్రెస్‌ బహిరంగ సభ

Feb 28,2024 22:23
1న తిరుపతిలో కాంగ్రెస్‌ బహిరంగ సభ

బాబు, జగన్‌ బిజెపి భావజాలంలో కలిసిపోయారు..ప్రత్యేకహోదా కాంగ్రెస్‌తోనే.. గిడుగు రుద్రరాజుప్రజాశక్తి- తిరుపతి(మంగళం): ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండి శ్రీవారి పాదాల చెంత విభజన ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ అని సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్దరాజు అన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారమిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొని వస్తానన్న జగన్‌, మరోవైపు చంద్రబాబు మోడీని దూషించి నేడు అధికారం కోసం వారితో పయనం అవుతున్నారంటే చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి ఇద్దరూ బిజెపి భావజాలంలో కలిసిపోయారని స్పష్టమవుతోందని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, అధికారం వస్తే కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చేసే గ్యారంటీ స్కీములను వివరిస్తూ వస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగుల ధర్నాలో పిసిసి అధ్యక్షురాలు వైయస్‌ షర్మిల రెడ్డి, నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. మార్చి 1న తిరుపతి వేదికగా కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టిందని, ఈ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్‌ పైలట్‌, ఏపీసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఇతర ప్రముఖులు ఈ బహిరంగ సభకు హాజరవుతారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, భాస్కర్‌, ఏపీసీసీ ఉపాధ్యక్షులు రాంభూపాల్‌ రెడ్డి, శ్రీరామమూర్తి, శంకర్‌, తిరుపతి పట్టణ అధ్యక్షులు యార్లపల్లి గోపి, పిసిసి కార్యదర్శి చిట్టిబాబు, లీలాశ్రీనివాస్‌, జావేద్‌ పాల్గొన్నారు.

➡️