మండే ఉపాధి వసతులు లేక కూలీల వ్యథ

మండే ఉపాధి వసతులు లేక కూలీల వ్యథ

మండే ఉపాధి వసతులు లేక కూలీల వ్యథప్రజాశక్తి – దొరవారిసత్రం మండు వేసవిలో జనం బయటకు రావడానికే భయపడే పరిస్థితి. కానీ జీవనోపాధి కోసం ముఖ్యంగా అసంఘటిత కార్మికులు మండుటెండల్లోనే పని చేయాల్సి వస్తోంది. ఉపాధి కార్మికులకు వేసవిలో ఉదయమే వచ్చి 10 కల్లా వెళ్లిపోయే వెసులుబాటు ఉంది. అంతేకాదు, పనిచేసే చోట వేసవి ఉపశమనం పొందేలా వారికి సౌకర్యాలను అందించాలి. అయితే గత రెండు మూడేళ్లగా ఉన్నతాధికారులు వసతులు పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. దీంతో మండుటెండలోనే చెమటలు కక్కుతూ ఉపాధి పనులు చేస్తూ కూలీలు వడదెబ్బ బారిన పడుతున్నారు. కనీసం వీరికి టెంట్‌, మంచినీళ్లు, మజ్జిగ వంటి ఉపశమనాలూ లేకపోవడం బాధించే అంశం. గ్రామీణ ప్రాంతాల్లో వామపక్షాల పోరాటాల ఫలితంగా ఉపాధి హామీ పథకం అమలవుతోంది. ఇది నిరుపేద కుటుంబాలకు వరంలా మారింది. జీవనోపాధి కోసం భానుడు నిప్పుల కొలిమిలా తన ప్రతాపాన్ని చూపిస్తున్నప్పటికీ ఎండ తీవ్రతను లెక్కచేయకుండా ఉపాధి కూలీలు పరుగులు పెడుతున్నారు. వేసవి కావడంతో ఉదయం ఏడు గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన ఎండలలో పనులు చేపట్టాలంటే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండల నుంచి కాసేపు ఉపశమనం పొందేందుకు కూలీలు నీడన కూర్చునేందుకు పని చేసిన ప్రదేశాల్లో టెంట్లు, గుడారాలు ఏర్పాటు చేయాలి. కానీ వీటి జాడ ఎక్కడ కనబడడం లేదు. దీంతో కూలీలు ఎర్రటి ఎండలోనే పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు ప్రభుత్వం నల్ల తార్పాల్‌ పట్టలను అందుబాటులో తీసుకొచ్చింది కానీ ఎండకు నల్ల తార్పాల్‌ వల్ల అధిక సెగ ఏర్పడుతుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పనులు జరిగే పని ప్రాంతాల్లో కూలీలకు ఏదైనా అపాయం జరిగితే అత్యవసరంగా ప్రథమ చికిత్స అందించేందుకు మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచాలి. కానీ ఇప్పటివరకు మెడికల్‌ కిట్లు ఎక్కడా కానరావడం లేదు. ఉపాధి కూలీలకు వడదెబ్బకు గురి కాకుండా ముందస్తు ప్రణాళికతో ప్రతి పంచాయతీలో ఉపాధి కూలీలకు అందుబాటులో ఓ ఆర్‌ ఎస్‌ ప్యాకెట్లు , ప్రథమ చికిత్స కిట్టు తో పాటు ఏఎన్‌ఎం లను ఏర్పాటు చేస్తే కొంతమేరకు ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలుగుతుందని దీనిపై అధికారులు దష్టి పెట్టాలని ఉపాధి కూలీలు అధికారులను వేడుకుంటున్నారు. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న మంచినీరు ఎండ తీవ్రతకు సరిపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. కూలీలకు ఎండ తీవ్రతను తట్టుకునేందుకు టెంట్లు తోపాటుకూలీలకు అందుబాటులో మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని పేర్కొంటున్నారు.

➡️