వెదురుకుప్పంలో వృద్ధుడు మృతిబ్యాంకుల వద్ద ఎండలో భారీ క్యూలైన్

వెదురుకుప్పంలో వృద్ధుడు మృతిబ్యాంకుల వద్ద ఎండలో భారీ క్యూలైన్

వెదురుకుప్పంలో వృద్ధుడు మృతిబ్యాంకుల వద్ద ఎండలో భారీ క్యూలైన్లుప్రజాశక్తి – యంత్రాంగం ఎన్నికల కోడ్‌ ఏమో గాని పింఛన్‌ పంపిణీ వృద్ధుల చావుకొచ్చింది.. గత నెల ఏప్రిల్‌ ఒకటో తేదీ సచివాలయాల వద్ద పంపిణీ చేయడం, అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా నలుగురైదుగురు ఎండ వేడికి చనిపోవడం జరిగింది. దీంతో ఈ నెల మే ఒకటో తేదీ మంచంలో లేవలేని వారికి మాత్రమే సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకు తీసుకొచ్చి డబ్బులు ఇస్తారని, మిగిలిన వారికి డైరెక్ట్‌గా బ్యాంకు అకౌంట్లలో పడుతుందని చెప్పారు. ఈ నిర్ణయం వృద్దులు పొయ్యి నుంచి పెనంపై పడినట్లయ్యింది.. అకౌంట్లలో వేసేసి అధికార యంత్రాంగం ప్రశాంతంగా ఉంది. అయితే అక్కడనుంచి వృద్ధుల పాట్లు మొదలయ్యాయి. మండుటెండలో వృద్దులు బ్యాంకుల వద్దకు ఉదయం 9 గంటల నుంచి బయల్దేరి వెళ్లి మధ్యాహ్నం వరకూ క్యూలైన్లలో వేచి ఉండి, పింఛన్‌ డబ్బులు తీసుకోవడం కనిపించింది. చాలాచోట్ల బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి. కొంతమంది పింఛన్‌ లేకపోతే పోయింది, మళ్లీ వచ్చి తీసుకుంటానని వెనుదిరిగిన వారూ లేకపోలేదు. ఏదిఏమైనా ఈ నాలుగైదు రోజుల పాటు బ్యాంకుల వద్ద వృద్దుల ప్రయాస అధికారుల నిర్లక్ష్యమేనని చెప్పవచ్చు. 1-5 తేదీల్లో ఇంటి ఇద్దకే వచ్చి ప్రతి వృద్ధునికి పింఛన్‌ ఇచ్చి ఉండొచ్చు. ప్రతినెలా ఒక వాలంటీర్‌ చేసే పని సచివాలయ సిబ్బంది ఎందుకు చేయలేరన్న ప్రశ్న వృద్ధుల్లో వినిపిస్తోంది. ఏదిఏమైనా నాలుగైదు రోజుల పాటు బ్యాంకుల వద్ద వృద్ధుల పాట్లు వర్ణనాతీతమే. గిరిజన కాలనీ గోపాలయ్య మృతి వెదురుకుప్పం…కార్వేటినగరం మండలం పద్మసరస్సు గిరిజన కాలనీ వాసి గోపాలయ్య (68) మృతితో విషాదం నెలకొంది. మామిడి తోటకు కాపలా ఉంటూ బతుకు జీవనం సాగిస్తున్నాడు. మే ఒకటో తేదీ తనకు రావాల్సిన పింఛన్‌ డబ్బుల కోసం గ్రామంలోకి వస్తూ మార్గమధ్యంలో ఎండ వేడి తాళలేక పడిపోయాడు. చుట్టుపక్కల జనసంచారం లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు. దీంతో ప్రాణాలు కోల్పోయారని కుటుంబసభ్యులు తెలిపారు. జీడీనెల్లూరు వైసిపి అభ్యర్థి కృపాలక్ష్మి నివాళి అర్పించారు. ఈ పాపం టిడిపిదని మండిపడ్డారు. ఎంపిపి లతా బాలాజీ, సర్పంచి ధనంజయవర్మ నివాళి అర్పించినవారిలో ఉన్నారు. జీడీనెల్లూరులోనూ పింఛన్‌ డబ్బు బ్యాంకు అకౌంట్లకు జమ చేయడంతో బ్యాంకులకు పాస్‌పుస్తకాలు, ఆధార్‌ తీసుకుని పండుటాకులు బ్యాంకులకు వెళ్లారు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక కొంతమంది వెనుదిరిగి వెళ్లడం కనిపించింది. అధికారులు స్పందించి పింఛన్‌ డబ్బు నేరుగా లబ్దిదారులకు ఇవ్వాలని కోరుతున్నారు. బంగారుపాళ్యంలో.. మండలంలో 27 సచివాలయాలు, 41 పంచాయతీల పరిధిలో 11 బ్యాంకులు ఉన్నాయి. మండల కేంద్రంలో ఏడు బ్యాంకులు ఉన్నాయి. బండ్లదొడ్డి, తుంబపాళ్యం గ్రామాల నుంచి మండల కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉంది. దీంతో ఉదయాన్నే బయల్దేరి వెళ్లి బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. కొందరికి ఇంకా బ్యాంకు ఖాతాల్లో నగదు పడలేదని సిబ్బంది చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఏ బ్యాంకులో పడిందో తెలియక కొంతమంది అన్ని బ్యాంకులనూ చుట్టే పరిస్థితి. గతంలో ఇంటి వద్దకే తెచ్చి పింఛన్‌ అందించేవారని, ఎన్నికల కోడ్‌ ఉందని ఒక్కో నెల ఒక్కో విధంగా మారుస్తూ తమను ఇబ్బందులు పెడుతున్నారని ‘ప్రజాశక్తి’కి తెలిపారు. పుత్తూరు టౌన్‌లో… స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద మండుటెండలో భారీ క్యూలైన్లతో వృద్ధులు కనిపించారు. కనీసం తాగేందుకు నీళ్లు సౌకర్యం కూడా లేదని కొంతమంది వాపోయారు. నేరుగా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి ఇచ్చి ఉంటే తమకు ఈ ఇబ్బంది ఉండేది కాదని పేర్కొన్నారు. పూతలపట్టులో.. తవణంపల్లిలో వృద్దులు, వికలాంగులు బ్యాంకుల ముందు మండుటెండలో అష్టకష్టాలు పడుతూ పడిగాపులు కాశారు. ఇంటి దగ్గరకే వచ్చే పింఛన్‌ను ఇలా నడివీధిపాలు చేశారని ఎంపిపి పట్నం ప్రతాపరెడ్డి, మాధవరం రవిరెడ్డి, సతీష్‌రెడ్డి తదితరులు మండిపడ్డారు. కేవీబీపురంలో.. సప్తగిరి గ్రామీణ బ్యాంకు వద్ద మండుటెండలో వృద్ధుల నిరీక్షణ కనిపించింది. బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. కనీసం టెంట్లు వేసి నీడ కనిపించిన పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇళ్ల వద్దనే పింఛన్‌ ఇవ్వకుంటే, కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పాకాలలో.. స్టేట్‌బ్యాంక్‌ వద్ద వికలాంగుల కోసం అనారోగ్య సమస్యలు తలెత్తకుండా షామియానా, మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేసింది. బ్యాంకు యాజమాన్యం సానుకూలంగా స్పందించడం వల్ల కొంతమేర వృద్ధులకు ఇబ్బందులు లేకుండా పింఛన్‌ తీసుకెళ్లారు.

➡️