స్ట్రాంగ్‌ రూముల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

స్ట్రాంగ్‌ రూముల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌, జిడి నెల్లూరు స్ట్రాంగ్‌ రూముల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.షణ్మోహన్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ పలమనేరు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌, నగరి ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమును, జీడి నెల్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూములను, ఈవీఎంల కమిషనింగ్‌ ప్రకియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గర పడుతోందని అధికారులంతా చురుగ్గా విధులు నిర్వర్తించాలన్నారు. ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గాలలోని స్ట్రాంగ్‌ రూములలో రూట్‌ నెంబర్లవారీగా స్టిక్కర్లు పూర్తిగా కల్పించేలా ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్‌ రూములలో పటిష్టమైన బందోబస్తుతో కూడిన భద్రతా ఏర్పాట్లను కొనసాగించాలని అన్నారు. స్ట్రాంగ్‌ రూముల కోసం ఇన్చార్జులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద ఎస్‌ఎస్‌టి బందాలు మరింత బాధ్యతతో పనిచేయాలన్నారు. ఎస్‌ఎస్‌టి బందంలో రిజిస్టర్ల నిర్వహణను పగడ్బందీగా నిర్వహించాలని, ప్రతి వాహనం, సమయం నమోదు చేయాలని ఎక్కడా లోపాలు లేకుండా పనిచేయాలని, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సంబంధిత తహశీల్దార్లను సంప్రదించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలలో బ్యారికేడింగ్‌ వ్యవస్థను పక్కాగా నిర్వహించాలని పోలింగ్‌ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. కలెక్టర్‌ వెంట పలమనేరు ఆర్‌డిఓ, ఆర్వో మనోజ్‌రెడ్డి, జీడి నెల్లూరు ఆర్‌ఓ వెంకటశివ, అధికారులు పాల్గొన్నారు.

➡️