కర్నూలు నుండి విజయవాడకు రైలు నడపాలి : సిఐటియు

Nov 23,2023 16:32 #Kurnool

ప్రజాశక్తి – కర్నూలు : కర్నూలు నగరం నుండి విజయవాడకు ప్రతిరోజూ రైలు నడపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు డిమాండ్‌ చేశారు. కర్నూలు నుండి విజయవాడకు రైలు నడపాలని, కర్నూలులో నిర్మాణం అవుతున్న రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాప ను వెంటనే పూర్తి చేసి ప్రారంభించాలని, రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక రైల్వే స్టేషన్‌ దగ్గర సిఐటియు నగర కార్యదర్శి సిహెచ్‌ సాయి బాబా అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు నగరం నుండి విజయవాడకు వెళ్లే వారి సంఖ్య పెరిగిందని, అయితే కర్నూల్‌ నగరం నుండి విజయవాడకు రైలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అందుకని కర్నూలు నగరం నుండి విజయవాడకు రైలు నడపాలని కోరారు. అలాగే కర్నూలు నగరం నుండి మచిలీపట్నం రైలును కూడా పునరుద్ధరించాలని కోరారు. రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ ను తొందరగా పూర్తి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే రంగాన్ని ప్రైవేటుకరించడానికి పూనుకున్నారని, రైల్వేలను ప్రైవేటీకరించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే 150 రైల్వే స్టేషన్లను, 400 వరకు రైళ్లను ప్రైవేటు వారికి అప్పగించడానికి ప్రతిపాదనలు చేశారని, రైల్వే రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన రవాణా రంగం రైల్వే రంగమని, అదేవిధంగా ప్రపంచంలోనే ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్న రంగం భారత రైల్వే రంగం అని అన్నారు. ప్రజలకు నూటికి 47% రాయితీస్తూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దాదాపు రోజుకు మూడు కోట్ల మందిని చేరవేస్తున్న రైల్వే రంగాన్ని నిర్వీర్యం చేయడానికి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైల్వే రంగ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఆల్‌ ఇండియా స్థాయిలో పోరాటాలు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. గతంలో రైల్వే రంగంలో మూడు లక్షల మంది పనిచేసేవారని, ప్రస్తుతం రెండు లక్షలకు తగ్గిందని అన్నారు. సిబ్బంది తగ్గడం వల్ల పనిభారం పెరిగి రైల్వే ప్రమాదాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావున రైల్వే రంగాన్ని ప్రైవేటుకరించే విధానాలు మానుకోవాలని కోరారు. ధర్నా అనంతరం రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు టి రాముడు, ఓల్డ్‌ సిటీ సిఐటియు కార్యదర్శి విజరు, సిఐటియు నగర నాయకులు సుధాకరప్ప, ప్రభాకర్‌, మహమ్మద్‌ రఫీ, యేసు, ఆటో వర్కర్‌ యూనియన్‌ నాయకులు శ్రీనివాసులు, నరసింహులు పాల్గొన్నారు.

➡️