ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలతో సుందరయ్యకు నివాళి

May 19,2024 23:34

నివాళులర్పిస్తున్న గుంటూరు విజరుకుమార్‌ తదితరులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి, ప్రధాని మోడీపై పోరాటం పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి అని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌ అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ప్రకాష్‌ నగర్‌లోగల ఎన్‌జిఓ హోంల సుందరయ్య వర్ధంతి సభ సిపిఎం సీనియర్‌ నాయకులు ఎవికె దుర్గారావు అధ్యక్షతన నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించినానంతరం విజరు కుమార్‌ మాట్లాడుతూ వర్గ రహిత సమాజం కోసం సుందరయ్య పోరాడారని, ఆ ఆశయాలను కొనసాగించాలని అన్నారు. ప్రజాపోరాటాలతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనస్సుల్లో సుందరయ్య చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. శ్రమను గౌరవించే సమాజం కోసం పాటుపడ్డారని, స్త్రీలను కించపరచడం, దళిత, బలహీనవర్గాలను పీడించే చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఎమెర్జెన్సీ సమయంలో ఆయన పాత్ర కీలకమన్నారు. విలువలు, త్యాగాలు, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం సుందరయ్యని కొనియాడారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రతి మనిషీ సుందరయ్యలా జీవించాలని, ఆయన ఆదర్శాలను పాటించాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, పట్టణ కార్యదర్శి షేక్‌ సిలార్‌ మసూద్‌, నాయకులు డి.శివకుమారి, సయ్యద్‌ రబ్బాని, బి.సలీం, హుస్సేన్‌, మస్తాన్‌వలి, రాంబాబు, సుభాష్‌ చంద్రబోస్‌, కె.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️