ఉత్తరాంధ్ర ద్రోహి జగన్‌

Apr 24,2024 22:01

 ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు

అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

2025 నాటికి భోగాపురం ఎయిర్‌ పోర్టు నిర్మిస్తాం

కూటమి గెలిస్తే వలసలను అరికడతాం : పవన్‌ కల్యాణ్‌

ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : ఉత్తరాంధ్ర ద్రోహి వైఎస్‌ జగన్‌ అని, ఐదేళ్లల్లో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేకపోయాడని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. సాగు, తాగునీరు లేక ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారని, వలసలు ఆపేందుకు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరాంధ్రలో ఉన్న తారకరామతీర్థ ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పారు. పోలవరం పూర్తి చేసి అక్కడ నుంచి సుజల స్రవంతి ద్వారా రైతులకు సాగు, తాగునీటిని అందిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలం సింగవరం, విజయనగరం కలెక్టరేట్‌ వద్ద జరిగిన సభల్లో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే 2025 నాటికి భోగాపురం ఎయిర్‌ పోర్టును పూర్తి చేసి స్థానికులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామన్నారు. వైసిపి ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా 169 దేవాలయాలపై, విగ్రహాలపైన దాడి చేశారన్నారు. రామతీర్థంలోని శ్రీరాముడు తల నరికేశారని దీనిపై ప్రశ్నించిన తనపై కేసు కూడా పెట్టారని గుర్తు చేశారు. జగన్‌కు పవన్‌కు తేడా ఉందని, జగన్‌ తన తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను పీడిస్తున్నాడని, పవన్‌ రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నాడని చెప్పారు. జగన్‌ తాను ఒక్కడినే పోటీ చేస్తున్నాను అంటున్నాడని, అతనితో పాటు అతని అహంకారం, అవినీతి సొమ్ముతో రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. 2014లో తండ్రి, 2019లో బాబారు హత్య, ఇప్పుడు గులకరాయి డ్రామాలు ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. పేదలకు ఒక సెంటు భూమి ఇచ్చి విశాఖలో విలాస వంతమైన పేలస్‌ను కొట్టేశాడన్నారు. చేతనైతే రాష్ట్రంలో సంపద సృష్టించాలన్నారు. పులివెందులలో ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కొండలను మింగేసిన అనకొండ అని అన్నారు. ఇక్కడ గాజు గ్లాసుపై నొక్కితే జగన్‌ గుండెల్లో గుచ్చుకోవాలన్నారు.

పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పోరాటం తప్పదన్నారు. జగన్‌కు ఒక వింత వ్యాధి ఉందని ఎవరు నవ్వినా జీర్ణించుకోలేడని ఎద్దేవా చేశారు. యువత భవిష్యత్తు కోసమే పొత్తులని, ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలంటే కూటమి విజయం సాధించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లిమర్ల జ్యూట్‌మిల్లుపై దృష్టి పెడతామని, ప్రతి చేతికీ పని ఉండేలా ప్రణాళికలు రచిస్తామని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే బలమైన లా అండ్‌ ఆర్డర్‌ను తీసుకొస్తామని చెప్పారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లకుండా పని చేస్తామన్నారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ యువత భవిష్యత్తు కోసం పోరాటం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్‌పి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి, టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు, మాజీ మంత్రి పడాల అరుణ తదితరులు పాల్గొన్నారు.

➡️