ఎస్‌జిటిల ఖాళీలు తేల్చాలి : డివైఎఫ్‌ఐ

ప్రజాశక్తి-దర్శి : జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్‌జిటి పోస్టుల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులు రాతపూర్వకంగా ఇవ్వాలని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కెవి.పిచ్చయ్య కోరారు. స్థానసిక సుందరయ్య భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డివైఎఫ్‌ఐ పోరాట ఫలితమే మెగా డిఎస్‌సిని విడుదల చేసినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో కేవలం 124 ఎస్‌జిటి పోస్టులు భర్తీ చేస్తారని వివిధ పత్రికల్లో వార్తలు వస్తున్నట్లు తెలిపారు. వాస్తవంగా జిల్లాలో దాదాపు 1000 ఎస్‌జిటి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు ఎస్‌జిటి పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్క తేల్చాలన్నారు. పోస్టు సంఖ్య లెక్క తేల్చి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. లేనిపక్షంలో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డిఎస్‌సి అభ్యర్థులు, నిరుద్యోగులతో కలిసి ఆందోళనలు చేపడతామనిహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు ఆర్‌జెసి.పాల్‌, నాయకులు కె.వెంకట్రావు, షేక్‌. పీరాసాహెబ్‌, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️