ఎపిఎల్‌ సీజన్‌-3 ట్రోఫీ ఆవిష్కరణ

Jun 30,2024 00:46 #APL Season 3 trophy
APL Season trophy

 ప్రజాశక్తి -పిఎం పాలెం : ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ మూడవ సీజన్‌ ఆదివారం నుంచి వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ప్రారంభం కానుంది. మొత్తంగా 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యాచ్‌లు జులై 13వ తేదీన ముగియనున్నాయి. వైజాగ్‌లోని ఓ హోటల్‌లో ఏపీఎల్‌ ట్రోఫీతో పాటు జెర్సీనిశనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌ఆర్‌.గోపీనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ, చెన్నై, కర్ణాటకతో పాటు మరో రాష్ట్రంలో మాత్రమే స్థానిక ప్రీమియర్‌ లీగ్‌లు ఉండేవని, ఆ తర్వాత ఆంధ్రలో ఏపీఎల్‌ను ప్రారంభించామని చెప్పారు. స్థానిక క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ లీగ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో ఏపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించిన కెఎస్‌.భరత్‌, ఎన్‌.నితీష్‌కుమార్‌రెడ్డి, రిక్కి భురు, షేక్‌ రషీద్‌, పృధ్వీరాజ్‌, హరిశంకర్‌ రెడ్డి, విమెన్‌ లీగ్‌ నుంచి స్నేహ దీప్తి, షబ్నం ఐపిఎల్‌కు ప్రాతినిధ్యం వహించారని వివరించారు. ఏపీలో ఆడుతున్న క్రీడాకారులంతా ఏపీఎల్‌ను వేదికగా చేసుకుని పెద్ద స్థాయిలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. మ్యాచ్‌ను తిలకించేందుకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్థులతో పాటు క్రికెట్‌ అభిమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైజాగ్‌ వారియర్స్‌ కెప్టెన్‌ కెఎస్‌.భరత్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) అత్యాధునిక, మౌలిక వసతులు కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు వి.మురళీమోహన్‌, డి.ఆస్కార్‌వినోద్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ఎన్‌.గీత, రాయలసీమ కింగ్స్‌, కోస్టల్‌ రైడర్స్‌, ఉత్తరాంధ్ర లయన్స్‌, గోదావరి టైటాన్స్‌, జెజవాడ టైగర్స్‌, వైజాగ్‌ వారియర్స్‌ జట్ల ఫ్రాంచైర్లు, కెప్టెన్లు తదితరులు పాల్గొన్నారు. స్టార్‌ స్పోర్ట్‌ తెలుగు, స్టార్‌ స్పోర్ట్స్‌ ఫస్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

➡️