ఆదాయంపై అలక్ష ్యం?

Feb 23,2024 21:05

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరాభివృద్ధికి కీలకం.. నగరపాలక సంస్థకు వచ్చే ఆదాయం. ఆస్తి పన్ను, నీటి పన్ను, ప్రచార పన్ను వంటి వివిధ రూపాల్లో వచ్చే ఆదాయమిది. అటువంటి ఆదాయం వసూలు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. పన్నుల వసూలు కోసం ప్రత్యేకంగా నగర పాలక సంస్థలో రెవెన్యూ విభాగం, అధికారి, ఆర్‌ఐలు, బిల్‌ కలెక్టర్లు ఉన్నారు. వీరితో పాటు మూడేళ్లుగా సచివాలయ ఉద్యోగులు అన్ని డివిజన్లలోనూ ఉన్నారు. ఐదేళ్ల క్రితం సచివాలయ ఉద్యోగులు ఎవరూ లేరు. అయినా ఉన్న ఉద్యోగులతో పన్నులు వసూలు చేసేవారు. నాటికి, నేటికి పెద్ద మార్పు మాత్రం కనిపించడం లేదు. ఉద్యోగుల సంఖ్య పెరిగింది తప్ప పన్నుల వసూళ్లలో పురోగతి కనిపించడం లేదు. విజయనగరం నగర పాలక సంస్థలో ఏడాదికి వసూలు కావాల్సిన పన్నులు మొత్తం రూ.39 కోట్లు. మరో ఐదు రోజుల్లో 11 నెలలు పూర్తికానున్నాయి. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటి వరకు వరకు రూ.39 కోట్లకు కేవలం రూ.17 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా రూ.22 కోట్లు వసూలు కావాల్సి ఉంది. 11 నెలల్లో రూ.17 కోట్లు వసూలు చేసిన రెవెన్యూ శాఖ… మిగిలిన నెల రోజుల వ్యవధిలో రూ.22 కోట్లు వసూలు చేయగలదా? అంటే సందేహించాల్సిందే. గతంలో జనవరిలో సంక్రాంతి పండుగ పూర్తయిన వెంటనే పన్నుల వసూలు ముమ్మరం చేసేవారు. దీని కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకొని, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వసూలు చేస్తే సుమారుగా 80 శాతం వరకు చేరుకునేవారు. ఫిబ్రవరి నెల నాలుగు రోజుల్లో పూర్తికానున్నా, ఇంకా 50 శాతం కూడా వసూలు కాలేదు. ఇంకా పన్నుల వసూలు జోరందుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి, మొండి బకాయిల కింద కోర్టు కేసుల కారణంగా వసూలు కావాల్సినవి రూ.10 కోట్లపైగా ఉంది. మొండి బకాయిలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వసూలు చేయాల్సి ఉంది. ఉన్న 35 రోజుల్లో వంద శాతానికి చేరుకోవడమంటే కష్టమేనని చెప్పాలి. ఇప్పటికైనా పన్నుల వసూలుపై శ్రద్ధ వహిస్తారో? లేదా ఇదే మందకొడి పద్ధతి కొనసాగిస్తారో వేచి చూడాలి.ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాంపన్నుల వసూలుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం. వంద శాతం పన్నుల వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పన్నుల వసూలుపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు ప్రక్రియకు చర్యలు తీసుకున్నాం. పన్నుల వసూలు కోసం రెడ్‌ నోటీసులు సిద్ధం చేస్తున్నాం. ఉన్న కొద్ది సమయంలో పన్ను చెల్లింపుదారులను అందరినీ కలిసి వసూలు చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. నగర ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి పన్నులు చెల్లించాలి. ఎవరైనా పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తాం.- ఎం.ఎం.నాయుడు, కమిషనర్‌

➡️