ఆర్థిక బకాయిలు విడుదల చేయాలి

Jan 31,2024 20:35

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయలకు ఆర్థిక బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేసింది. బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట యుటిఎఫ్‌ ఆధ్వర్యాన చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆ సంఘం రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాసరావు ప్రారంభించారు. దీక్షలను ఉద్దేశించి యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్‌సి, ఎరియర్స్‌, డిఎ, ఎపిజిఎల్‌ఐ, పార్ట్‌పేమెంట్లు కలుపుకొని రూ.18 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్ర కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయగా కేవలం రూ.1200 కోట్లు మాత్రమే విడుదల చేశారని, ఇంకా రూ.17వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. తాము దాచుకున్న డబ్బులను ఇవ్వడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 4 లక్షల మంది ఉద్యోగులు డబ్బులు ఇవ్వకుండా తాత్సారం చేయడం అన్యాయమన్నారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీక్షల్లో యుటిఎఫ్‌ నాయకులు జి.పార్వతి, సూర్యారావు, రాజారావు, శంకరరావు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️