కొండను కొల్లగొట్టేశారు

Mar 25,2024 21:31

ప్రజాశక్తి-రేగిడి : కొండను పిండి చేసి గళ్లా నింపుకొంటున్నారు.. కొంతమంది అక్రమార్కులు. అనుమతులు లేకున్నా యథేచ్ఛగా గ్రానైట్‌ అక్రమ రవాణా చేస్తున్నారు. ఒకటీ రెండు నెలలు కాదు.. దాదాపు పదేళ్లుగా ఈ తంతు సాగిస్తున్నారు. స్టోన్‌క్రషర్ల యజమానులే సిండికేట్‌గా ఏర్పడి ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. అక్రమ రవాణా ద్వారా వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. ఇన్నేళ్లుగా ఈ దందా సాగిస్తున్నా అధికారులెవరూ దాడులు చేయకపోవడం, కనీస చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విచ్చలవిడిగా బాంబు బ్లాస్టింగ్‌లతో పరిసర గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.రేగిడి మండలం తాటిపాడు, కొండవలస, పెద్దశిర్లాం పంచాయతీల నడుమ ఉన్న కొండ.. అక్రమార్కులకు అడ్డాగా నిలిచింది. ఈ కొండ సంపదను అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ రవాణా చేయడంతో అక్రమార్కులు లక్షల్లో కాసులు వెనకేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులూ లేకున్నా.. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన విశ్వసముద్ర పేరుతో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఏడు స్టోన్‌ క్రషర్లకు ట్రాక్టర్లతో కొండ సంపద తరలిపోతోంది.. పదేళ్లుగా ఈ కొండ అక్రమార్కుల చేతుల్లోనే కొనసాగుతుంది. కొండ గుట్ట రాళ్లను పగలకొట్టేందుకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బాంబులను వినియోగిస్తున్నారు. బ్లాస్టింగ్‌తో కిలోమీటర్ల మేర రాళ్లు ఎగిరి అటుగా వెళ్లిన ప్రయాణికులు, పాదచారులు, కూలీలు, రైతులకు గాయాలైన సందర్భాలు కోకొల్లలు.
చూసీచూడనట్టు వదిలేస్తున్నారా?
తాటిపాడు, కొండవలస, పెద్ద శిర్లాంలో పగలు, రాత్రి తేడా లేకుండా బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. వాహనాలతో రాయిని డ్రిల్లింగ్‌ చేసి ముక్కలుగా చేయించి ట్రాక్టర్లు, లారీలతో ఇతర ప్రాంతాలకు నలుపు, తెలుపు గ్రానైట్‌ రాయి ఎగుమతి చేస్తున్నారు. కొండవలస కొండ తవ్వకాల్లో ఎనిమిది నెలల క్రితం ఓ వ్యక్తి రాళ్లు పడి మృతి చెందాడు. ఈ రాళ్లగుట్ట తవ్వకాలకు అధికారులతో సంబంధం లేదంటూ అక్కడ నిర్వాహకులు ధైర్యంగా చెబుతున్నారు.. దీన్ని బట్టి చూస్తే అధికారులకు ముడుపులు అందుతున్నాయని ఆయా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఈ కొండ అక్రమాలపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇప్పటికైనా మైన్స్‌, పోలీస్‌, రెవెన్యూ అధికారులు స్పందించి విలువైన కొండ సంపదను కాపాడాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.
తనిఖీలు చేపడతాం
ప్రభుత్వ కొండ సంపదను పరిరక్షిస్తాం.. ఈ కొండ విస్తరణలో భాగంగా తవ్వకాలలో పొడవు , వెడల్పు, ఎత్తు కొలతల కొలిచి అక్రమ దారుల నుంచి రికవరీ చేయిస్తాం. మైన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తాం. అనుమతులు లేకుండా తవ్వకాలు చేసిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. అరెస్టు చేయిస్తాం.- రాములమ్మ, తహశీల్దార్‌

➡️