కౌన్‌ బనేగా కేండిడేట్‌

Mar 25,2024 21:33

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : విజయనగరం లోక్‌సభ అభ్యర్థిత్వం నుంచి బిజెపి అనూహ్యంగా తప్పుకోవడంతో టిడిపిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీంతో అధిష్టానం అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభిస్తోంది. ఎన్నికల పొత్తులో భాగంగా విజయనగరం లోక్‌సభ స్థానాన్ని బిజెపి కోరడం, అందుకు టిడిపి అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించడం విదితమే. దీంతో, విజయనగరం ఎమ్‌పి అభ్యర్థి కోసం టిడిపి అధిష్టానం నిన్నటి వరకు ఆలోచించలేదు. బిజెపి అభ్యర్థిగా ఎవరు వస్తారా? అని జనంలో ఆసక్తికర చర్చ నడిచింది. పున:పరిశీలనలో భాగంగా బిజెపి అగ్రనాయత్వం విజయనగరానికి బదులు రాజంపేట లోక్‌సభ టికెట్‌ను తీసుకుంది. దీంతో తిరిగి టిడిపి తమ అభ్యర్థిని చూసుకోవాల్సి రావడంతో అధినాయకత్వం గెలుపు గుర్రాన్ని అన్వేషిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు, రాష్ట్ర మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు, టిడిపి చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. ఈ ఎన్నికలు టిడిపికి చావోరేవో అన్నట్టుగా ఉండడం, లోక్‌సభ అభ్యర్థిని బట్టే అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలం, బలహీనత ఉండే పరిస్థితులను భేరీజు వేస్తూ అధిష్టానం ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న పేర్లకు ప్రత్యామ్నాయానికి కూడా పరిశీలిస్తోందట. పొత్తులో భాగంగా జనసేన, బిజెపికి కొన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు తగ్గుతాయని భావించిన టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఆశావహులను వెనక్కి తగ్గించింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగరం అసెంబ్లీ స్థానం తన కుమార్తె అదితి గజపతిరాజుకు కేటాయించాలంటూ అశోక్‌ పార్టీని కోరారు. ఈ ప్రతిపాదనను చంద్రబాబు సున్నితంగా తిరస్కరిస్తూ ‘మీరే పోటీలో ఉండాలి’ అంటూ అశోక్‌కు సూచించారట. చివరికి అశోక్‌ తన కుమార్తె కోసం పట్టుబట్టారని, దీంతో బాబు కూడా అశోక్‌ను పక్కనబెట్టి అదితికి సీటు ఖరారు చేశారని విశ్వస నీయ సమాచారం. ఈ నేపథ్యంలో అశోక్‌ తిరిగి తన కోసం ఎమ్‌పి టికెట్‌ అడిగే పరిస్థితి లేకపోవడంతో, ఇదే అదునుగా బాబు కూడా విజయనగరం లోక్‌సభ స్థానాన్ని బిజెపికి హామీ ఇచ్చారట. దీంతో పార్టీ ఎమ్‌పి అభ్యర్థి కోసం ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. బిజెపి తరపు ఆశావహుల్లో విజయనగరం కన్నా ఇతర స్థానాల్లో ఉన్నవారికి ప్రాధాన్యతనిచ్చింది. దీంతో, నిన్నగాక మొన్న బిజెపి విడుదల చేసిన జాబితాలో విజయనగరం లోక్‌సభను మినహాయించినట్టు సమాచారం. ఈనేపథ్యంలో టిడిపి తరపు అభ్యర్థిని బరిలోకి దింపుకునేందుకు అవకాశం కలిగింది. ఇప్పటికే విజయనగరం, మన్యం జిల్లాల్లో చీపురుపల్లి, పాలకొండ అసెంబ్లీ అభ్యర్థులను తేల్చలేక తటపటాయిస్తున్న టిడిపికి ఎమ్‌పి అభ్యర్థిని కూడా గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అశోక్‌ తనకు తానుగా సీటు కోసం ప్రస్తావించే పరిస్థితి లేదు. అలాగని పిలిచి సీటిద్దామనుకుంటే సామాజికవర్గ విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈనేపథ్యంలో ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు లోక్‌సభకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదట. ఇక చీపురుపల్లిని పదేళ్లుగా అంటిపెట్టుకుని ఉన్న కిమిడి నాగార్జున కూడా ఎమ్‌పిగా పోటీకి ససేమీరా అంటున్నారట. చాలా కాలంగా చట్టసభలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పేరును బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన సూచిస్తున్నట్టు సమాచారం. వీరిలో ఎవరో ఒకరిని లోక్‌సభ అభ్యర్థిగా పంపే అవకాశం ఉంది. పార్టీ నిర్ణయానికి వారు కట్టుబడి ఉంటారా? లేక ప్రత్యామ్నాయం పరిశీలిస్తారా? అనేది టిడిపిలో జరుగుతున్న చర్చ. ఈ చిక్కుముడి వీడాలంటే మరో రెండు మూడు రోజులు నిరీక్షించాల్సిందేనని పరిశీలకులు చెబుతున్నారు.

➡️